టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ నమోదైన కేసు నీరుగారిపోయినట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనేందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు పోలీసులు. స్పాట్ లో వంద కోట్లు పట్టుకున్నామన్న పోలీసులు ఆ తరువాత దానిని 15కోట్లకు కుదించారు. ఇప్పుడు ఆ డబ్బు గురించి కూడా క్లారిటీ లేదు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడి కారులో నాలుగు బ్యాగులో డబ్బులున్నాయని చెప్పారు. కాని కోర్టుకు మాత్రం అసలు డబ్బే దొరకలేదని చెప్పడంతో ఈ కేసు వెనక ఎదో జరుగుతుందన్న అనుమానాలకు బలం ఏర్పడింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నించారని చెప్పేందుకు ఆధారాలున్నాయని పోలీసులు కోర్టుకు చెప్పలేదు. బుధవారం రాత్రి తెగ హడావిడి చేసిన పోలీసులు ఆ తరువాత సైలెంట్ కావడంతో ఈ మొత్తం వ్యవహారంలో తెరవెనక గట్టి రాజకీయమే జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఒక్క ఆధారం కూడా కోర్టుకు సమర్పించకుండా నిందితులకు స్టేషన్ బెయిల్ వచ్చేలా చేశారని అంటున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అమిత్ షా , కిషన్ రెడ్డిల ఆడియో టేప్ ఉందని , బీజేపీ బండారం బయటపడుతుందని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను కేసీఆర్ తెలియజేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కాని ఆయన మీడియాకు మొహం చాటేశారు. తీరా ఈ ఇష్యూపై ఎవరూ మాట్లాడవద్దని మంత్రి కేటీఆర్ సూచనలతో ఈ కేసు నిర్వీర్యమైపోయినట్లు అయిందని అంటున్నారు.