టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిజంగానే బీజేపీ విఫలయత్నం చేసిందా..? ఆ నలుగురు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయేందుకు సిద్దపడి ఆఖర్లో పోలిసుల ఎంట్రీతోనే ఫ్లేట్ ఫిరాయించారా..? పక్కగా ప్లాన్ చేసి నేతలను తన బుట్టలో వేసుకునే బీజేపీ ఈసారి ఫెయిల్ కావడానికి కారకులెవరు..? బీజేపీ సెక్రెట్ ఆపరేషన్ విషయాన్ని చేరవేసింది ఆ పార్టీ ఎమ్మెల్యేనే టీఆర్ఎస్ అధినేతకు చేరవేశారా..?
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చి బీజేపీలో చేర్చుకోవాలని ప్రలోభపెట్టారని, ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యేలే కేసీఆర్ కు చేరవేశారని చెబుతున్నారు. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. ఫామ్ హౌస్ వేదికగా బీజేపీ తమను పార్టీ మారాలని ప్రలోభాలకు గురి చేసిందని వారు ఎక్కడ చెప్పలేదు. పైగా మీడియా దృష్టి నుంచి తప్పించుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. వారంతా 400కోట్ల ఆఫర్ కు అమ్ముడుపోయేందుకు సిద్దమయ్యారని , ఆఖర్లో పోలిసుల ప్రవేశంతోనే అక్కడి నుంచి తుర్రుమన్నారనే వాదనలు కూడా ఉన్నాయి.
ఏ రాష్ట్రంలోనైనా ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని తలిస్తే బీజేపీ అనుసరించే వ్యూహాలు ఊహకు అందని విధంగా ఉంటాయి. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, తమ ప్లాన్ పక్కాగా అమలు అయిన తరువాతే బీజేపీ వ్యూహం మూడో కంటికి తెలిసేలా ఉంటుంది. పార్టీ ఫిరాయింపులో ఏమాత్రం ప్లాన్ బెడిసికొట్టకుండా వ్యవహరించే బీజేపీ తెలంగాణలో మాత్రం ఎలా విఫలం అయిందని అందరూ సందేహిస్తున్నారు.
బీజేపీ ప్లాన్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఒకరు మంత్రి కేటీఆర్ కు చేరవేశారన్న అభిప్రాయపడుతున్నారు. రఘునందన్ రావే బీజేపీ గేమ్ ప్లాన్ ను రివీల్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుందని రఘునందన్ ఇచ్చిన ఇంఫర్మేషన్ తోనే కేటీఆర్ పోలీసు శాఖను రంగంలోకి దింపారని బీజేపీలోని ఓ వర్గం అనుమానిస్తోంది.