దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న మంత్రి కేటీఆర్ మునుగోడులో మాత్రం రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీష్ రావు మునుగోడు మొహం చూడటం లేదు. దాదాపు మంత్రులంతా మునుగోడులో మొహరించి ప్రచారంలో తలమునకలైపోతుంటే హరీష్ మాత్రం ప్రచారంలో పాల్గొనకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేలో మునుగోడులో కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండనుందని తేలింది. టీఆర్ఎస్ కొద్దిగా లీడ్ లో కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేదన్నది టీఆర్ఎస్ సర్వేల సారాంశం. బీజేపీకి 18శాతం ఓటు బ్యాంక్ మాత్రమే నమోదు అవుతుందని..అది కూడా రాజగోపాల్ చరిష్మాతోనే ఆ మాత్రం పోటీనైనా ఇస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ప్రచారం ముగిసే నాటికీ టీఆర్ఎస్ కే కాస్త ఎడ్జ్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. వరుసగా రెండు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్ఎస్ మునుగోడులో విజయం గనుక సాధిస్తే ఆ క్రెడిట్ కేటీఆర్ ఖాతాలో వేయాలని కేసీఆర్ భావించినట్లు టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే విడతల వారీగా కేటీఆర్ తో ప్రచారం నిర్వహిస్తున్నారని అంటున్నారు.
హరీష్ రావు ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు మోసిన దుబ్బాక, హుజురాబాద్ లో పార్టీ ఓటమి పాలు కాగా..మునుగోడులో ప్రచార బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ సారధ్యంలో పార్టీ విజయం సాధించిందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని టీఆర్ఎస్ అధిష్టానం వ్యూహం రూపొందించినట్లు సమాచారం. ఈటల లాగా హరీష్ రావుతోనూ ఎప్పటికైనా ముప్పే ఉంటుందని భావిస్తోన్న కేసీఆర్..హరీష్ పార్టీలో ఉండగానే ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని తండ్రి, కొడుకిలిద్దరూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ ను కాదని..ఈసారి కేటీఆర్ ను కేసీఆర్ రంగంలోకి దింపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ కూడా ప్రచారానికి దూరంగా ఉండి, కేటీఆర్ ను రంగంలోకి దింపారని అంటున్నారు.