బీజేపీని కీలక నేతలు వీడటంపై పార్టీ అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ పార్టీ నుంచి వలసలు ఊపందుకోవడంపై హైకమాండ్ ఆరా తీస్తోంది. నేతలు అసలెందుకు పార్టీని వీడుతున్నారో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో పార్టీని నేతలు వీడుతుంటే చేరికల కమిటీ చైర్మన్ ఏం చేస్తున్నారని ఈటల రాజేందర్ పై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీని నేతలు ఒక్కొక్కరుగా వీడుతుంటే ఈటల రాజేందర్ వలసలను నివారించేందుకు ప్రయత్నాలేమైనా చేశాడా..? అని రాష్ట్ర నాయకత్వంతో చర్చించినట్లు తెలుస్తోంది. చేరికలను అటుంచితే నేతలను పార్టీ మారకుండా చర్యలు చేపట్టకపోవడం ఎంటని ఈటల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
గతంలో టీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ జాయినింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు కట్టబెట్టింది. టీఆర్ఎస్ లో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారో తెలిసిన ఈటలకు ఈ బాధ్యతలు అప్పగిస్తే బీజేపీలోకి చేరికలు మరింత ఊపందుకుంటాయని అగ్రనేతలు భావించారు. ఇందులో భాగంగా అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు చేరికలపై ఆయన దృష్టి సారించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఈటలను మనస్తాపానికి గురి చేశాయి. అప్పటి నుంచి చేరికలపై ఈటల దృష్టి పెట్టడం పూర్తిగా మానేశారు.
పార్టీలో ఈటల యాక్టివ్ రోల్ పోషించకపోవడానికి బీజేపీలో వర్గపోరు కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. తానొ పక్క చేరికలపై ఫోకస్ చేస్తుంటే తన స్థాయిని తగ్గించేలా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటలను మనస్తాపానికి గురి చేశాయి. దాంతోనే చేరికల కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నప్పటికీ ఆయన హుజురాబాద్ నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవుతున్నారు. ఈ క్రమంలోనే నేతల వలసలపై ఆయనకు సమాచారం కూడా లేదట. అందుకే వలసల నివారణకు ఈటల ఎలాంటి ప్రయత్నం చేయలేదని సమాచారం.