ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై నమోదైన కేసులో సాయి బాబాతోపాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శనివారం నిలిపివేసింది.
బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) ప్రకారం జీఎన్ సాయి బాబాను ముందుగా విచారించడానికి అనుమతి తీసుకోలేదనే కారణాన్ని చూపి, సాయి బాబాను నిర్దోషి అని ఎలా ప్రకటిస్తారని తుషార్ మోహత వాదించారు. కేవలం సాంకేతిక అంశాలను ఆధారం చేసుకొని హైకోర్టు బెయిల్ కు అంగీకరించిందన్నారు. కేసులో వాస్తవాలను పరిశీలనలోకి తీసుకేలేదన్నారు.
సాయి బాబా తరుఫున సీనియర్ న్యాయవాది బసంత్ వాదనలు వినిపించారు. 90శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న సాయి బాబాను ఏడేళ్ళుగా జైలులో ఉంచారని, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జైలు బయట ఉండేందుకు అనుమతివ్వాలని వాదించారు. అనంతరం తదుపరి విచారణ కోసం కోసం నోటిసులు జారీ చేస్తామని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. బాంబే హైకోర్టు తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.