ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీలు దూకుడు మీదుండటంతో టీఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్చడంలో టీఆర్ఎస్ బడా నేతలే కీలక పాత్ర పోషించారని..ఇందులో కొన్ని వేల కోట్లు చేతులు మారి ఉంటాయనే కోణంలో విచారణ చేపట్టిన సీబీఐ, ఈడీ అధికారులు అరెస్టులు కూడా చేశారు.
ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు టీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన అభిషేక్ రావు ఉన్నారు. అయితే, అభిషేక్ రావును విచారించిన సీబీఐ అధికారులు.. అతనితో వ్యాపార సంబంధాలు కల్గి ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళైను అరెస్ట్ చేయలేదు. ఇందుకు ఆయన అప్రూవర్ గా మారడమే కారణమని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అరుణ్ రామచంద్ర పిళ్ళై ను ఈ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ సమయంలోనే అన్ని ఆధారాలు సేకరించిన సీబీఐ అధికారులు.. కీలక డాక్యుమెంట్స్ ను పిళ్ళై ముందుంచడంతో.. ఈ స్కాంకు సంబంధించిన వివరాలు మొత్తం బయట పెట్టేశాడని అంటున్నారు. ఆయన నుంచి కీలక విషయాలను రాబట్టడంతోనే పిళ్ళై ను మినహాయించి అభిషేక్ ను అరెస్ట్ చేశారన్న వాదనలు వస్తున్నాయి.
నిజంగా, రామచంద్ర పిళ్ళై అప్రూవర్ గా మారితే టీఆర్ఎస్ కీలక నేతలు లిక్కర్ స్కాం ఉచ్చులో బిగుసుకుపోయినట్లే. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారని ఆరోపణలు రావడంతో ఈ కేసు విషయంలో ఏం జరగబోతుందన్న ఉత్కంట కంటిన్యూ అవుతోంది. అలాగే, ఎంపీ సంతోష్ రావు సన్నిహితులు కూడా ఉండటంతో ఈ స్కాం ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళన టీఆరెస్ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది.