బతుకమ్మ చీరల్లో భారీ కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తోంది. 18 లక్షల మంది మహిళల కోసం ఈ ఏడాది బతుకమ్మ చీరలకై 340కోట్లు కేటాయించింది ప్రభుత్వం. పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి చీరలు కొనుగోళ్ళు చేసినా సర్కార్ పంపిణీ చేసిన చీరలన్నీ నాసిరకంగా ఉన్నాయంటూ మహిళలు నిరసన తెలుపుతుండటంతో అసలేం జరిగి ఉంటుందని ఆరా తీస్తే విస్తుపోయే విషయాలు మెల్లగా బయటకొస్తున్నాయి.
ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న ఒక్క చీర విలువ కూడా వంద రూపాయలు ఉండే ఛాన్స్ లేదంటున్నారు మహిళలు. లేదు.. ఒక్కో చీరకు వంద రూపాయల చొప్పున లెక్క కట్టినా 18కోట్లు మాత్రమే అవుతాయి. మరి, ప్రభుత్వం కేటాయించిన 340కోట్లలో మిగతా 322కోట్లు ఎవరు కాజేశారన్న చర్చ జరుగుతోంది. కల్వకుంట్ల పాలనలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు… బతుకమ్మ చీరల కొనుగోళ్ళలోనూ దోపిడీ చేశారని ఆరోపిస్తున్నారు. బతుకమ్మ చీరల పేరుతో 322కోట్లను కాజేశారని ఆరోపణలు రావడంతో తెలంగాణ మహిళా సమాజం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నేతన్నలు రూపొందించిన చీరలను కొనుగోళ్ళు చేసి పండగ పూట మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్… రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తోన్న బతుకమ్మ చీరలు నేతన్నలు తయారు చేసినవి కానే కావని చెబుతున్నారు. ఎక్కడో గుజరాత్ నుంచి 100రూపాయలకు కిలో చొప్పున చీరలను కొనుగోళ్ళు చేసి ఉంటారని.. అవే చీరలను బతుకమ్మ చీరలంటూ అందిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. బతుకమ్మ చీరల పేరుతో జరిగిన 322కోట్ల కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు.
బతుకమ్మ చీరల నాణ్యతపై ప్రతి చోట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఈ చీరలను తమ జీవితంలో కట్టుకోనేలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేషన్ దుకాణాల్లోనే బతుకమ్మ చీరలను వదిలేసి వెళ్తున్నారు. మరికొన్ని చోట్ల చీరలను దగ్ధం చేసి బతుకమ్మ ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకలినైనా భరిస్తాం కాని అవమానాన్ని చంపుకొని బతకలేం అంటూ సర్కార్ పంపిణీ చేస్తోన్న బతుకమ్మ చీరలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో ప్రతిరోజు ఎదో చోట బతుకమ్మ ఆడుతూ కనిపిస్తోన్న కవిత సర్కార్ పంపిణీ చేసిన చీరలను కట్టుకుంటుందా అని నిలదీస్తున్నారు.