అనుకున్నది ఒక్కటి..అయినది ఒక్కటి..బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అనే సాంగ్ అందరికీ దాదాపు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ పాట గురుంచి ఎందుకంటారా..? మరేం లేదండి.. హుజురా ‘బాద్ షా’ ఈటల పరిస్థితి బీజేపీలో అలాగే మారిందని ఆయన అనుచర వర్గం మధనపడుతోంది. టీఆరెస్ నుంచి తప్పుకున్నాక ఎటు తేల్చుకోలేక అనేక పరిణామాల మధ్య చివరికి తను నమ్మిన సిద్దాంతాన్ని కూడా కాదని శరణు కోరుతూ బీజేపీలో చేరిపోయారు. అయితే, ఆయన బీజేపీలో చేరడం ఆ పార్టీకి కొంత ఊపు తీసుకొచ్చినా బండి సంజయ్ కు మాత్రం ఉక్కపోత పుట్టిస్తుందట. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి చివర్లో హాజరైన బండి సంజయ్..ఆయన గెలుపునకు కూడా పెద్దగా సహకరించింది లేదు. ఈటల ఒక్కడే తన అనుచరులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు. మొత్తానికి అనేక ఆటుపోట్ల మధ్య హుజురాబాద్ లో ఈటల గెలిచి బీజేపీలో ట్రంప్ కార్డు అయిపోయారు.
హుజురాబాద్ లో ఈటల గెలుపు కేసీఆర్ పై గెలుపుగా అభివర్ణించారు. దీంతో బీజేపీలో ఈటల సిఎం క్యాండిడేట్ అంటూ ఆయన వర్గం ప్రచారం చేసుకోవడం…బండితోపాటు కిషన్ రెడ్డి వర్గానికి ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఈటలను పార్టీలో రాజకీయంగా అంతగా ప్రోత్సహించవద్దని ఇరువర్గాలు డిసైడ్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొంత క్రేజ్ తెచ్చుకున్నా పార్టీలో మాత్రం ఈటల ఒంటరే అయ్యారు. పార్టీ అగ్రనేతల నుంచి కావాల్సిన సహకారం అందుతోన్న రాష్ట్ర నాయకత్వం నుంచి సంపూర్ణ సహకారం లేకపోవడంతో ఈటల అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ ఆఫీసుకు అడపాదడపా వచ్చిపోతున్నారు తప్పితే బండి సంజయ్ పాదయాత్రలో ఒక్కసారి కూడా కనిపించింది లేదు. బీజేపీ బాస్ కూడా ఈటలను దూరం పెడుతున్నారు.
పార్టీలో ఆయన ప్రియార్టి తగ్గడంతో హుజురాబాద్ కే పరిమితమైన ఈటల సేవలను వాడుకోవాలని భావించి జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈటలకు చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు కట్టబెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించింది. కాని , ఆయనతో చర్చించకుండానే పలువురు నేతలను బండి సంజయ్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఈటల నొచ్చుకున్నారని తెలుస్తోంది. దాంతో ఆయన చేరికలపై ఫోకస్ పెట్టడం మానేసి మళ్ళీ సాధారణ ఎమ్మెల్యేగా హుజురాబాద్ కే పరిమితం ఆయ్యారని అంటున్నారు ఆయన అనుచరులు. హుజురాబాద్ విన్నింగ్ తో ఎదో అవుతుందని అనుకుంటే ఇలా బెడిసికొడుతుందని ఈటల తెగ మధనపడుతున్నారట.