సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య మూడో టీ 20 జరగనున్న నేపథ్యంలో టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ కు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలివచ్చారు. టికెట్ల జారీలో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది గేట్లు దూకి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు.
భారత్ – కంగారుల మధ్య టీ -20 మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ ఏర్పాట్లు చేసింది. జింఖానా మైదానంలో టికెట్లు విక్రయాలు జరుగుతాయని హెచ్ సీఏ వెల్లడించింది. టికెట్ల కోసం తల్లవారుజాము నుంచే క్రీడాభిమానులు బారులుతీరారు. మూడు వేల టికెట్ల కోసం ముప్పై వేల మంది రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కొంతమంది గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించగా ఖాకీలు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. ఓ మహిళా మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, మహిళా మృతి చెందిందనే వార్తలను నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ ఖండించారు.
టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో మహిళకు గాయాలు అయ్యాయని.. ప్రస్తుతం ఆమె యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని సూచించారు. వీఐపీ పాస్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఒత్తిళ్ళు ఉండటంతో ఎం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టికెట్ల జారీ కోసం చేసిన ఏర్పాట్లు ఏమాత్రం సౌకర్యంగా లేవని అసహనం వ్యక్తం చేశారు. టికెట్లను అధికారులు బ్లాక్ లో అమ్మేసి… పైపైచ్చ్చు కొన్ని టికెట్ల కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు.