తెలంగాణలోని ప్రభుత్వ వసతి గృహాలలో కలుషిత ఆహరం తిని తల్లడిల్లుతోన్న విద్యార్థుల వేదనలే పేపర్లో బ్యానర్ ఐటెం గా ప్రతిరోజు కనిపిస్తున్నాయి. జిల్లాకో చోట కలుషిత ఆహరం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలైన సంఘటనలు వెలుగుచూస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. అంగన్ వాడీ, ప్రాథమిక , సెకండరీ , హై స్కూల్ , గురుకుల స్కూళ్ళ నుంచి యూనివర్సిటీల స్థాయివరకున్న వసతి గృహాలలో కలుషిత ఆహరంతో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి అవుతున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.. ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన భోజనం అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఫెయిల్ అయింది.
తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన టీఆర్ఎస్…సర్కార్ సంక్షేమ వసతి గృహాల్లో తినే తిండిని కూడా కలుషితం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. గత కొన్నాళ్ళుగా కలుషిత ఆహరం తిని విద్యార్థులు అస్వస్థతకు గురి అవుతున్నా ప్రభుత్వం మకేమి అన్నట్లుగా పట్టించుకోవడం లేదు. మంత్రి హరీష్ రావు ఇలాక సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల స్కూల్ లో 128 మంది విద్యార్ధినులు కలుషిత ఆహరం తిని పేగులను కుళ్ళబొడుస్తుండగా హాహాకారాలు చేస్తూ తల్లడిల్లారు. ఈ సంఘటన మరవకముందే బాసర IIITలో కలుషిత ఆహరం కలకలం రేపింది. అక్కడ కూడా 200 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలయ్యారు. అందులో ఓ విద్యార్ధి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందాడు. కాని అనారోగ్య సమస్యలతోనే మృతి చెందడంటూ ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకుంది. ఇక మధ్యాహ్న భోజనం బకాయిలు చెల్లించకపోవడంతో స్కూల్స్ లోనూ మిడ్ డే మీల్స్ గొడ్డు కారంతో వడ్డించే పరిస్థితిని కూడా చూశాం.
తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహరం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరుగుతుందని వరుస సంఘటనలు కళ్ళకు కడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక బలమైన కారణం ఉందనే అనుమానాలు కల్గుతున్నాయి. ప్రభుత్వ హాస్టల్ కాంట్రాక్ట్ లను కల్వకుంట్ల కుటుంబానికి చెందినవారికీ అప్పగించడంతోనే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించడం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఎలాగు నిరు పేద కుటుంబానికి చెందిన విద్యార్థులే ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటారు.. వారు చస్తే ఎంత అనే దుర్మార్గమైన ఆలోచనతోనే ఇదంతా జరుగుతుందని యువజన కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.