నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి
- ప్రాజెక్టుల పేరుతో అరాచకాలు చేస్తున్న ప్రభుత్వం
- రైతులపై లాఠీఛార్జీ, సంకెళ్లు వేయడంపై నీలదీత
- కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ, తీవ్రంగా మండిపాటు
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు, సాగునీరు పేరుతో అరాచకాలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల గురించి వందల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
పరిహారం అడిగిన నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేసి, చేతులకు బేడీలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఖమ్మంలో ఆదివాసీ మిర్చి రైతులకు సంకెళ్లు వేశారని గుర్తుచేశారు. నిర్వాసితుల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సమంజసమా…? అని ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. రైతులపై పెట్టిన కేసుల్ని
తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులు కోరకున్న విధంగా పరిహారం ఇవ్వాలని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని రీడిజైన్‌తో ముంపు గ్రామాల సమస్య 1 నుంచి 8కి పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. గౌరవెల్లిలో నాడు మైనర్లుగా ఉండి ఇప్పుడు మేజర్లయిన వారికి రూ.8 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు.