తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండటంతో… అధికార, విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా గెలుపు బావుటా ఎగురవేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను జనంలో ఎండగట్టాలని విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ ముఖ్యనేతలు తెలంగాణలో వరుస పర్యటనలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యనేత రాహుల్ గాంధీ వరంగల్ సభతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ నేతలు వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. పార్టీ ఎజెండా నచ్చడంతో పలువురు కాంగ్రెస్ లోకి వస్తున్నారు.
కాంగ్రెస్ లో జోష్
రైతులకు మేలు జరగాలన్నా… ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమనే విషయాన్ని ఆ పార్టీ నేతలు జనాలకు వివరిస్తున్నారు. గ్రామగ్రామాన రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజా మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్ ఎజెండాకు ప్రజలకు ఆకర్షితులవుతున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్ నేతలు బలంగా చెప్పుకునే అవకాశం డిక్లరేషన్ తో సాధ్యమైంది. ఈ నేపథ్యంలో.. బీజేపీలో చేరికలు తగ్గి, కాంగ్రెస్ లోకి చేరికలు పెరిగాయి. ఇప్పటికే అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి ఏపీలో మాజీ సీఎల్పీ లీడర్, ప్రజానాయకుడు దివంగత పి.జనార్దన్ రెడ్డి కూతురు, ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనుండటంతో… నియోజకవర్గంలో చర్చ విస్తృతమైంది.
విజయారెడ్డి చేరికపై జోరుగా చర్చ
ప్రజానాయకుడు పి.జనార్దన్ రెడ్డి మరణం తర్వాత… ఆయన రాజకీయ వారసుడిగా పి.విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. ఇక తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పీజేఆర్ కుమార్తె పి.విజయారెడ్డి వైసీపీలో పని చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2015లో, 2020లో వరుసగా రెండు సార్లు ఖైరతాబాద్ కార్పొరేటర్ గా గెలిచారు. ప్రస్తుతం ఆమె తన తండ్రి జీవితాంతం పని చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 23న అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ తరఫున రెండుసార్లు కార్పొరేటర్‌గా గెలిచినప్పటికీ… ఏ అంశంపైనా మాట్లాడకుండా బౌండరీలు గీశారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు. తన తండ్రి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
టీఆర్ఎస్ లో అడుగడుగునా నిరాశే
టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి కీలక పదవులు పి.విజయారెడ్డిని వరించినట్టే వరించి… దూరమయ్యాయి. 2018లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా… అప్పటికే టీఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్ వైపు పార్టీ మొగ్గు చూపింది. విజయారెడ్డికి నిరాశే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ మేయర్ పదవి రేసులోనూ చివరి వరకు ఉన్నారు. కానీ… టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి పదవి దక్కింది. మళ్లీ విజయారెడ్డికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న విజయారెడ్డి చివరికి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే శనివారం రాత్రి టీఆర్‌ఎస్ సభ్యత్వానికి తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో పేర్కొన్నారు.
విజయారెడ్డి భవితవ్యమేంటి…?
కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం పి.విజయారెడ్డి పాత్ర ఎలా ఉండబోతోందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. టికెట్ పై తనకు ఎలాంటి హామీ లేదని, కేవలం కాంగ్రెస్ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుందన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్టు విజయారెడ్డి చెప్పారు. అలాగే..
విజయారెడ్డికి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లిలలో ఏదో ఒక నియోజకవర్గ బాధ్యతను అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఖైరతాబాద్ టికెట్ ఎవరికి..?
కాంగ్రెస్ లో విజయారెడ్డి చేరికపై ముఖ్యంగా ఖైరతాబాద్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ నుంచి 2018లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ గ్రేటర్ కన్వీనర్, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహిణ్ రెడ్డి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. సభ్యత్వ నమోదు, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దాసోజు శ్రవణ్ ఓ సారి ఓడిపోయినందున… ఈ సారి కొత్త అభ్యర్థి రోహిణ్ కు టికెట్ ఇస్తారని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విజయారెడ్డికి ప్రతికూలాంశాలు
ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన చింతన్ శిబిర్ లో తీసుకున్న నిర్ణయాలు… విజయారెడ్డికి ఆటంకం కానున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి టికెట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ తీర్మానం చేసింది. అలాగే పార్టీలో ముందు నుంచీ పని చేసిన వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చింది. ఈ నిర్ణయాలు విజయారెడ్డికి ప్రతిబంధకాలు కానున్నాయి. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ రెండు నియోజకవర్గాలు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఒకే లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పక్కపక్క నియోజకవర్గాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్లు ఇవ్వడం అసాధ్యం. అలాగే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైమ్ మాత్రమే ఉంది. కాబట్టి.. ఆమెకు టికెట్ ఇవ్వడం వీలు కాకపోవచ్చని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఆమెకు ఎలాంటి పోస్ట్ ఇస్తారు…. కాంగ్రెస్ లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.