భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో ఇంక్ దాడి జరిగింది. బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 12 మంది నిరసనకారులు వేదిక ముందుకు వచ్చి రైతు నేతలపై ఇంక్ చల్లారు. టికాయత్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ గందరగోళం సృష్టించారు. కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్ వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. టికాయత్ సహా రైతు నేతలుపై ఇంక్ చల్లిన ముగ్గురు నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన టికాయత్, కర్ణాటక ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. స్థానిక పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి తాము విజయం సాధించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, తమ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే ఇలాంటి దాడులు జరుపుతున్నారని కిసాన్ ఏక్తా మోర్చా సంస్థ ట్వీట్ చేసింది. రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు వ్యతిరేకంగా పోరాడతామని పేర్కొంది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో నిరసనలు జరిపిన కిసాన్ సంయుక్త మోర్చా సమన్వయ కమిటీ ఏడుగురు సభ్యుల్లో టికాయత్ ఒకరు. ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో భారీ స్థాయిలో జరిగిన కిసాన్ మజ్దూర్ పంచాయత్ సభలో పాల్గొన్న టికాయత్.. గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేయకపోతే నగరాల్లో విద్యుత్ సరఫరాను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైతు సమస్యల పరిష్కారంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.