భారత్ లో నిరుద్యోగిత 24 శాతం
ప్రపంచంలోనే అత్యధికం
విభజిత విధానాలతో ఆర్థిక పునాదులకు నష్టం
దేశంలో 1990 ల నాటి పరిస్థితులు
ఆవేదన వ్యక్తం చేసిన ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు
భారత దేశంలో రోజు రోజుకీ ఎక్కువ అవుతోన్న నిరుద్యోగిత, పతనం అవుతోన్న వృద్ధి రేటు ఆర్థిక, సామాజిక నిపుణులను కలవరపెడుతోంది. దేశ ఆర్థిక పునాదాలు బలంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుత తిరోగమానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే అని పరోక్షంగా విమర్శిస్తున్నారు. 2009 నుంచి 2012 వరకు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ గా వ్యవహరించిన ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు.. తాజాగా ఇలాంటి ఆందోళనే వ్యక్తం చేశారు. దేశంలో ప్రజల మధ్య విభజన తెచ్చే విధానాలు దేశ ప్రగతి పునాదులను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నప్పటికీ, సమాజంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయని, ఇది దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారుతోందని తెలిపారు.
ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలిచేందుకు కృషి చేస్తోన్న భారత్.. ప్రస్తుతం తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కుంటోందని కౌశిక్ బసు అన్నారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగిత రేటు 24 శాతంగా ఉందని, ప్రపంచంలోనే ఇది అత్యధికమన్నారు. ఉద్యోగ కల్పన, ఆర్థిక పురోగతిలో వైఫల్యాలకు ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని పరోక్షంగా విమర్శించారు.
“ ఏ దేశ అభివృద్ధి అయినా కేవలం ఒక ఆర్థిక విధానం మీదనే ఆధారపడి ఉండదు. ప్రజల మధ్య పరస్పర విశ్వాసం, నమ్మకం ఉంటేనే అది సాధ్యం. దేశంలో ప్రస్తుతం ప్రజల మధ్య విభజన ఎక్కువ అవుతోంది. ఇది జాతి అభివృద్ధి పునాదులను దెబ్బతీస్తోంది. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా, పేదల – మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మనం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 1990 ల నాటి పరిస్థితులు దేశంలో మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయి” అని కౌశిక్ బసు అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత గొడవులు ఎక్కువయ్యాయి. గుడులు, మసీదుల వివాదాలు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయి. దిగజారుతోన్న దేశ ఆర్థిక వ్యవస్థలను బాగుచేయడం కన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం మత సంబంధిత అంశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని అనేక మంది సామాజిక వేత్తల ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కుతున్నాయి. నిత్యావసరాలు భగ్గుమంటున్నాయి. రూపాయితో డాలర్ విలువ కనిష్టానికి పడిపోయింది. ద్రవోల్బణం 8 ఏళ్ల గరిష్టానికి చేరింది. నిరుద్యోగిత ప్రపంచంలోనే అత్యధికంగా 24 శాతాన్ని మించి ఎగబాకుతోంది. పేదలు, మధ్య తరగతి ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ అంశాలను అదుపు చేయాల్సిన కేంద్ర సర్కార్… చోద్యం చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు నుంచి వచ్చిన ఈ పదునైన విమర్శలు.. పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కి మొట్టికాయలు వేసినట్లుగానే ఉన్నాయి.