–సీబీఐ, ఈడీని ఎందుకు ప్రయోగించడం లేదు..?
-కేంద్రం చర్యలపై నెల వేచి చూస్తానని స్పష్టీకరణ
- తెలంగాణకు ప్రాంతీయ పార్టీ అవసరముందని వెల్లడి
-మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని, జైలుకు పంపుతామని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. నెలలు గడచినా అందుకు సంబంధించిన ఊసే ఉండటం లేదు. ఇక దమ్ముంటే టచ్ చేసి చూడాలని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ.. ఇద్దరిలో ఎవరూ మరో అడుగు ముందుకు వేయడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా ఆయన రాజకీయ ప్రయాణం ఎటు..? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి పెను సవాల్ విసిరారని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొండా ప్రశ్నించారు. సీబీఐ, ఈడీతో విచారణ జరిపే అవకాశం ఉన్నా… ఎందుకు వెనుకాడుతోందని సూటిగా నిలదీశారు.
బీజేపీ ఏం చేస్తుందో చూస్తా..!
తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ తీసుకునే చర్యల కోసం నెల రోజులు వేచి చూస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో చేరికపై ఆ పార్టీ నేతల నుంచి ఎలాంటి ఒత్తిడి చేయడంలేదని వివరించారు. టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడే పార్టీకే తన మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.