వినండి కవితగారూ… రాహుల్ ఎందుకు రావాలో చెబుతాం..!
కవిత ప్రశ్న: గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.?
జవాబు: దేశంలో మోదీ నియంతృత్వాన్ని, బీజేపీ నేతల అసహనాన్ని ప్రశ్నిస్తున్న లీడర్ రాహుల్. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై గళమెత్తుతున్న ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణకు జాతీయ రహదారుల కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయాన్ని లోక్‌సభలో రేవంత్ ప్రశ్నించారు. మీకు తెలియదా..?
వినండి కవితగారూ… రాహుల్ ఎందుకు రావాలో చెబుతాం..!
కవిత ప్రశ్న: తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు..?
జవాబు: తెలంగాణ ప్రజల హక్కులు గుర్తించి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు అంశం దగ్గర నుంచి కశ్మీర్ జనాల కష్టాల వరకు లోక్‌సభలో మాట్లాడారు. మీరేమో తెలంగాణ హక్కుల కోసం పని చేయకుండా స్వప్రయోజనాల కోసం వడ్ల కొనుగోలు అంశాన్ని బీజేపీతో కలిసి రాజకీయ డ్రామా చేస్తున్నారు.
వినండి కవితగారూ… రాహుల్ ఎందుకు రావాలో చెబుతాం..!
కవిత ప్రశ్న: దేశవ్యాప్తంగా వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు..?
జవాబు: మీ లాలూచీ కుస్తీ మొదలైందెప్పుడు..? రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దయిన తర్వాత కదా..! అసలు ఆ చట్టాలు రద్దు చేయాల్సిందే అని పోరాటం చేసిందెవరు..? రాహుల్, ప్రియాంక ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొన్నారు. మరి మీ నాయన ఏం చేశారు. రైతులతో కలిసి ఉద్యమిస్తా అని ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మీ నాయన పిట్టలదొర మాటలు మాట్లాడి, ఢిల్లీ పోయిన తర్వాత ఏం చేశారు. రైతుల్ని కాల్చి చంపుతున్న మోదీ, అమిత్ షాకు షాలువాలు కప్పి, రైతుల మొహం కూడా చూడకుండా రాలేదా..? ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ ఉన్నారో దేశం చూసింది.
వినండి కవితగారూ… రాహుల్ ఎందుకు రావాలో చెబుతాం..!
కవిత ప్రశ్న: తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పెండింగ్ జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు.?
జవాబు: విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి.. 2018లో టీడీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఆ సమయంలో అవిశ్వాస తీర్మానికి కాంగ్రెస్ బేషరతుగా మద్దతుగా నిలిచింది. కానీ సభను గందరగోళపర్చి.. ఉభయ సభల్లో తీర్మానం అటకెక్కేలా కేంద్రానికి సహకరించింది మీ టీఆర్ఎస్ ఎంపీలు కాదా..? అప్పుడు విభజన హామీలపై ఉభయ సభల్లో చర్చ జరిగేందుకు అడ్డుపడ్డదెవరు..?
వినండి కవితగారూ… రాహుల్ ఎందుకు రావాలో చెబుతాం..!
కవిత ప్రశ్న: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?
జవాబు: విద్యాసంస్థలు మాత్రమే కాదు.. ఏ విభజన హామీ అయినా కాంగ్రెస్ ఇచ్చిందే. ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తూనే ఉంది. తెలంగాణకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే బీజేపీ సర్కారు తీసుకొచ్చే ప్రతీ చట్టానికి మీరెందుకు మద్దతు తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, పార్లమెంటులో ప్రశ్నించకుండా బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారు…?
వినండి కవితగారూ… రాహుల్ ఎందుకు రావాలో చెబుతాం..!
కవిత ప్రశ్న: ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరా తీసి, అవి తెలంగాణ ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకోండి. సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను స్ఫూర్తిగా తీసుకుని, 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవడానికి మీకు కూడా తెలంగాణకు స్వాగతం..!!
జవాబు: నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. వడరి వేస్తే ఉరే అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైతుల బేడీలకు సంకెళ్లు వేసిన మహా గొప్ప సర్కారు తమరిది. దేశవ్యాప్తంగా రైతులకు ఒక్క కిస్తీలోనే రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. తమరి అద్భుతమైన సంక్షేమ పాలనలో ఎంతమందికి ఎంత రుణమాఫీ చేశారో సెలివియ్యండి. తెలంగాణను అడ్డగోలుగా గోచుకుంటున్న మీ అవినీతి పాలనను ప్రశ్నించేందుకు రాహుల్ తప్పకుండా వస్తారు. మీ స్వాగతాలు, ఆహ్వానాలు, అనుమతులు అవసరం లేదు.