మార్పు వచ్చింది…పరిపాలనతో మార్పుతో..తెలంగాణలోని ఒక్కో వ్యవస్థలో మార్పు సంతరించుకుంటోంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్ధలో చోటు చేసుకుంటున్న మార్పు అంతా ఇంతా కాదు. ఒకప్పటి ఎస్‌ఐబీకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతల రక్షణలో కీలక పాత్ర పోషించే ఎస్‌ఐబీ గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. గతంలో జరిగిన విషయాల గురించి ఇప్పుడు ప్రస్తావన అనవసరం..కానీ ఇప్పుడు ఎస్‌ఐబీ పనితీరు దేశాన్ని ఆకర్షిస్తోంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల ఉనికిని ట్రాక్ చేయడమే లక్ష్యంగా ఏర్పడ్డ ఎస్‌ఐబీ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. ఫలితంగా గడిచిన ఏడాది రికార్డుస్థాయిలో 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీని వెనుక ఎస్ఐబీ కృషి ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాట్లు పెరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ ఇస్తున్న భరోసానే ప్రధాన కారణం. కేవలం లొంగుబాట్లను ప్రోత్సహించడం మాత్రమేకాదు..వారి పునరావాసం కోసం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అద్భుతమనే చెప్పాలి.
గతంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన శివధర్ రెడ్డి ప్రస్తుతం డీజీపీగా ఉన్నారు…ఎస్‌ఐబీలో సుమతి యాక్టీవ్ రోల్ కూడా ఈ వింగ్‌కు మరింత జోష్ ఇచ్చింది. వీటన్నింటికీ తోడు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హోంశాఖను చూడటం కూడా కలిసొచ్చింది. ఆయన చొరవతో ఎస్‌ఐబీకి మరింత ఊతం లభించింది. పోరు వద్దు-ఊరు ముద్దు అంటూ పోలీసు శాఖ తీసుకున్న కార్యక్రమంతో పాటూ ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస చర్యలను కల్పించడంలో పోలీసుశాఖ చూపిస్తున్న చిత్తశుద్ది కూడా లొంగుబాట్లు పెరిగేందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతేకాదు లొంగిపోయిన మావోయిస్టులను పునరావాసం కల్పిచేందుకు వారికి ఆధార్ కార్డులు, చిరునామా, బ్యాంకు అకౌంట్లు వంటివి కల్పించడం, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి చికిత్స అందించడం వంటివి కూడా వారిలో భరోసా నింపింది.
మావోయిస్టు రహిత దేశంగా భారత్‌ను మార్చుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన తర్వాత పలు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్లు పెరిగితే…తెలంగాణలో మాత్రం దానికి భిన్నంగా లొంగుబాట్లు పెరిగాయి. ఇందులో ప్రభుత్వ చొరవతో పాటూ పోలీసుశాఖ చాణక్యం కూడా ఉందనడానికి అతిశయోక్తి లేదు.
