అనుకున్నది సాధించేందుకు అనువైన సమయం కావాలి..అన్నది పెద్దలు చెప్పే మాట. ఒకవేళ అనుకూల సమయం రాకపోతే దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలన్నది సీఎం రేవంత్ రెడ్డి స్టయిల్. పది జిల్లాల తెలంగాణను తనకు ఇష్టం వచ్చినట్లు తునాతునకలు చేస్తూ అశాస్త్రీయంగా విభజన చేసిన గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేందుకు రంగంలోకి దిగారు రేవంత్ రెడ్డి. అయితే జిల్లాల పునర్ విభజనపై ఎక్కడా ఒక్కమాట కూడా మాట్లాడకుండానే…తన రాజకీయ చతురతతో బీఆర్ఎస్ పార్టీని తన ట్రాప్‌లోకి దించారు.
పది సంవత్సరాల పాటూ మంత్రిగా అనుభవం, తండ్రి రాజకీయ వారసత్వం ఉండి కూడా కేవలం రేవంత్ రెడ్డిని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న కేటీఆర్‌ను తన వేలితో తన కంటినే పొడుచుకునేలా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం అంటూ బయల్దేరి స్వయంగా కేటీఆరే.. జిల్లాల పునర్ విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి రాచమార్గం వేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడే జిల్లాల ఏర్పాటు జరిగిందన్న కనీస సోయి మరిచి…ఇప్పుడొచ్చి సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుపై పోరాటం అంటూ డ్రామాలు చేశారు.

మొదట్లో జిల్లాల పునర్ విభజన చేయొద్దంటూ అడ్డం..పొడుగు వాదించిన బీఆర్ఎస్…ఇప్పుడు మాత్రం సికింద్రాబాద్ జిల్లా కోసం పోరాటం చేస్తోంది. దీంతో ఇదే అదనుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తక్షణమే జిల్లాల పునర్ విభజనపై ముందడుగు వేశారు. ప్రతిపక్షం అడిగినట్లు అశాస్త్రీయంగా ఉన్న జిల్లాల ఏర్పాటును సరిదిద్దేందుకు కమిటీ వేశారు. ఇలా కేటీఆర్ నోటితోనే జిల్లాల పునర్ విభజనకు అనుకూలంగా మాట్లాడించి తన రాజకీయ చాణక్యాన్ని మరోసారి చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి ఇచ్చే రిపోర్డ్‌తో పాటూ నియోజకవర్గాల పునర్ విభజన కూడా జరిగిన తర్వాతే జిల్లాల పునర్ విభజన ప్రక్రియ జరిగే అవకాశముంది.
