జూబ్లీహిల్స్ దెబ్బతో కుదేలయిన బీఆర్ఎస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు శాశ్వతంగా సమాధికట్టే అవకాశం కనిపిస్తోంది. సిటీలో తమకు పట్టు ఉందని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టిగా సమాధానం ఇచ్చారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా గ్రామీణ ఓటర్లుంటారు. పదేళ్ల అరాచకాన్ని వాళ్లు ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు. కాబట్టి గ్రామాల్లోకి వెళ్లేందుకు ముందస్తుగా కొంత రూట్ తయారు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అందులో భాగంగానే హరీష్ రావు, కేటీఆర్ వంటివారు రైతులను కలవడం, మార్కెట్ యార్డుల్లో పర్యటించం వంటి హడావుడి చేస్తున్నారు.
అయితే బీఆర్ఎస్ నేతలు ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు పట్టించుకోరు. పైగా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి అసలు సరైన నిర్మాణమే లేదు. పది సంవత్సరాల పాటూ సంపాదన, కమిషన్ల మీద మాత్రమే దృష్టి పెట్టింది గులాబీ హైకమాండ్. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం అసలు జరుగలేదు. చాలా నెలలుగా అడ్‌హక్ కమిటీలతోనే కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల ఇంచార్జ్‌లుగా నియమించి నడిపిస్తూ వస్తున్నారు. ఇక గ్రామస్థాయిలో పార్టీకి అధ్యక్షులు కూడా సరిగ్గా లేని పరిస్థితి.
ఇలాంటి సందర్భంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలంటే లోకల్‌గా ఉన్న గులాబీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. అసలు గ్రామంలో అధ్యక్షుడే లేకపోతే ఎన్నికలను ఎవరు నడిపిస్తారని చాలా మంది బీఆర్ఎస్ నేతలు జిల్లాస్థాయి నాయకులను ప్రశ్నిస్తున్నా
రు. ప్రతీసారి గ్రామాల్లో ఇబ్బంది ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీంతో జిల్లాస్థాయి నాయకులు చెప్పిన మాటలు విని ఖంగు తింటున్నారు గ్రామస్థాయి కార్యకర్తలు. డోలు వచ్చి మద్దెలతో చెప్పుకున్నట్లుగా ఉందని…అసలు మాకే ఏ పదవి లేదు. రాష్ట్రస్థాయిలోనే కనీసం పార్టీ నిర్మాణం సరిగ్గా లేదు…ఇక గ్రామస్థాయి వరకు ఆలోచిస్తారా? అంటూ సమాధానం చెప్తున్నారంట.
బీఆర్ఎస్ పార్టీకి చెప్పుకునేందుకు 60 లక్షల సభ్యత్వం ఉంది కానీ..గ్రామాల్లో అధ్యక్షులు కూడా లేరా? అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పైగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఎలాగూ ఓడిపోతాం కాబట్టి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల గురించి బీఆర్ఎస్ అస్సలు కసరత్తు కూడా ప్రారంభించ లేదు. పైగా చాలా చోట్ల బీజేపీని బలోపేతం చేసేందుకు పోటీ కూడా చేయొద్దని ఇప్పటికే జారుకుంటుందని టాక్ నడుస్తోంది.
