నిజం చెప్పులేసుకునేలోపు…అబద్దం దునియా మొత్తం తిరిగి వస్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అబద్దాలను ప్రచారం చేయడంలో అభినవ గోబెల్స్ గా మారిపోయింది. ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఉన్నవి లేనట్లు చూపిస్తోంది. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిచేస్తుంటే కూడా వాటిని వక్రీకరించి చూపిస్తోంది. నానక్ రాంగూడలో ఏర్పాటు చేసిన 23 కిలో మీటర్ల సైకిల్ ట్రాక్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోంది. నిజానికి ట్రాక్ ను బీఆర్ఎస్ హయాంలోనే హడావుడిగా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాన్ని కంప్లిట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీంతో అధికారులు చేసిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకోలేదు. శివారు ప్రాంతంలో నిర్మించిన సైకిల్ ట్రాక్ ఒక రికార్డుగా మిగిలిపోవాలనే ఉబలామే తప్పితే..దాని వల్ల వచ్చే సమస్యలను పట్టించుకోలేదు. నానక్ రాంగూడ నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో గచ్చిబౌలిని కనెక్ట్ చేసే చోట ఈ ట్రాక్ కాస్త అడ్డుగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ర్యాంప్ నిర్మిస్తే..సమస్యను అధిగమించవచ్చని అధికారులు సూచించారు. కానీ నాడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ తుగ్లక్ నిర్ణయాలతో దాన్ని అలాగే కొనసాగించారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఆ తర్వాత వచ్చిన ప్రజా ప్రభుత్వం మాత్రం దీన్ని అలాగే వదిలేయలేదు. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు నడుం కట్టింది. ఇందుకోసం పలు సర్వేలు నిర్వహించారు అధికారులు. వారి నుంచి అనేక సూచనలు తీసుకున్నారు. ఇందుకోసం సైక్లింగ్ అసోసియేషన్ అథారిటీస్ అంగీకారం కూడా తీసుకున్నారు. అంతేకాదు ట్రాఫిక్ పోలీసుల నుంచి కూడా సూచనలు తీసుకుంది సర్కారు. చివరికి సైబరాబాద్ పోలీసుల సూచనలతో ఈ ప్రాంతంలో 80 మీటర్ల మేర ట్రాక్ ను తొలగించి ర్యాంప్ నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై పనులు మొదలు పెట్టారు.
అయితే దీనిపై చిలువలు పలువలు చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేపట్టింది. ఇదిగో తోక అంటే…అదిగో పులి అన్నట్లు వ్యవహరిస్తోంది. కేవలం 25 సెకెన్ల వీడియోను వైరల్ చేస్తున్నారు. కానీ అందులో నిజం ఎంత అనేది పట్టించుకోవడం లేదు. చుట్టు పక్కల ఏం జరుగుతుంది. అక్కడ ఎంత మేర తొలగిస్తున్నారు? అనే విషయాలు ఏవీ చెప్పకుండా గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. కొన్ని మీడియా సంస్థలు దీనిపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వార్తలు రాస్తున్నాయి. వాటిని చూసినవారు నిజా నిజాలేంటి? అనేది ఆలోచించకుండా నమ్మేస్తున్నారు.
ఈ వార్తలపై హెచ్ఎండీఏ అధికారులు కూడా వివరణ ఇచ్చారు. కేవలం 80 మీటర్ల మేర తొలగించి ర్యాంప్ వేస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్నది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు.