కారు పార్టీ అధినేత గారాలపట్టి వేరు కుంపటి పెట్టబోతున్నారా? పార్టీతో సంబంధం లేకుండా ఆమె చేస్తున్న హడావుడి వెనుక అసలు మర్మం అదే అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటెక్కడా కనిపించని ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య యాక్టీవ్ అయ్యారు. తన అంతరంగీకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ జెండా, కండువా ఎక్కడా లేకుండా కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ నేతలతో కూడా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వేరు కుంపటి ఖాయమని ఇప్పటికే బీఆర్ఎస్ నేతల్లో క్లారిటీ వచ్చేసింది. నిజానికి ఇది ఇటీవల జరుగుతున్న వ్యవహారం కాదు. ఆమె జైలుకు వెళ్లక ముందు నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు. కేటీఆర్ తో విభేధాలకు సంబంధించి రక రకాల పుకార్లు ఉన్నాయి. వాటిలో నిజాలు కూడా చాలానే ఉన్నాయన్నది బీఆర్ఎస్ నేతల మాట. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పార్టీ నేతలంతా హైడ్రా, లగచర్ల, నిరుద్యోగుల సమస్యలు అంటూ హడావుడి చేస్తుంటే ఆమె మాత్రం బయటకు రాలేదు. ఆరోగ్య సమస్యలతో పాల్గొనడం లేదని పార్టీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ కనీసం వారికి మద్దతుగా సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా వేయలేదు.
ఒకవైపు పార్టీ నేతలు లగచర్ల ఇష్యును హైలెట్ చేస్తుంటే..ఆమె మాత్రం వారితో సంబంధం లేకుండా నిమ్స్ లో గురుకుల స్టూడెంట్స్ ను పరామర్శించారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కేటీఆర్ విమర్శలు చేస్తుంటే…ఆమె మాత్రం అందుకు సహకరించి ఇన్ డైరెక్ట్ గా సంకేతం ఇచ్చారు. రెండు రోజుల క్రితం భారత జాగృతి పేరుతో సన్నిహితులతో ఒక సమావేశం నిర్వహించారు. పైకి ఆ పేరు పెట్టుకున్నప్పటికీ…కొత్త పార్టీ సన్నాహాలపై వారికి వివరించడమే అజెండా అన్నది రాజకీయ వర్గాల్లో టాక్. ఇప్పటికే ఏపీలో వైఎస్ జగన్ తో విభేదిస్తూ షర్మిల వేరే పార్టీ పెట్టారు. తొలుత అన్నపై ఎలాంటి కామెంట్లు చేయకపోయినప్పటికీ… ఆ తర్వాత ఆస్తి విభేదాల వల్లనే ఇద్దరి మధ్య వివాదం ముదిరింది అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలోనూ అదే తరహా గొడవలు జరుగుతున్నాయని పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఈ విషయంలో కేసీఆర్ మాట కూడా కవిత వినడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమైన శాఖలను కేటీఆర్ కు అప్పగించి…సంపాదించుకునే అవకాశం ఆయనకే ఇచ్చారని కవిత అలక బూనారని సన్నిహితులు అంటున్నారు. తనకు పెద్దగా సంపాదించే ఛాన్స్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి కవిత తిరుగుబాటు చేస్తున్నారని, ఇప్పుడు అది మరింత ముదిరిందని చర్చించుకుంటున్నారు. గతంలో కేటీఆర్ కు కవిత రాఖీ కట్టేందుకు వెళ్లకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరించడం వంటివి గుర్తు చేసుకొని ఇదంతా నిజమే అయి ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు. అయితే ఇటీవల పార్టీ సోషల్ మీడియాలో కవితకు వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెట్టడం, ఆడియోలు బయటకు రావడం వంటి పరిణామాలతో కవితకు కూడా ఇదంతా కేటీఆర్ చేయిస్తున్నాడనే క్లారిటీ వచ్చిందంట. అందుకే వేరు కుంపటి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం సాగుతోంది.