పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. స్పీకర్ దే తుది నిర్ణయమని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అంతేకాదు స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి డెడ్ లైన్ లేదని కూడా స్పష్టం చేసింది కోర్టు. సరైన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతోపాటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది డివిజన్ బెంచ్. ఈ తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, త్వరలోనే ఎన్నికలు వస్తాయని ఊహల పల్లకిలో ఊరేగిన బీఆర్ఎస్ నేతల ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. హైకోర్టు తీర్పు ప్రజా ప్రభుత్వానికి బూస్ట్ ఇచ్చింది.
ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న బీఆర్ఎస్ వాదనలకు కూడా బ్రేక్ పడింది. అయితే ఈ ఏడాది కాలంగా ప్రజా సర్కార్ వ్యవహారశైలి చూస్తుంటే…బీఆర్ఎస్ వాదనంతా ఉత్తిదే అని స్పష్టమవుతోంది. రెండు టర్ముల్లో ప్రతిపక్షాల పట్ల కేసీఆర్ వ్యవహారశైలి..ఇప్పుడు రేవంత్ సర్కారు తీరుకు చాలా తేడా ఉందంటున్నారు విశ్లేషకులు. రెండు సార్లు ప్రతిపక్షం లేకుండా చేసేందుకు సీఎల్పీని విలీనం చేసుకున్నారు కేసీఆర్ అంతేకాదు తొలి టర్ములో వైఎస్సార్సీపీ, టీడీపీ, బీఎస్పీలను కూడా విలీనం చేసుకున్నారు. ఇక రెండో సారి ఎక్కువమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని సీఎల్పీ విలీనం అయిపోయిందంటూ ప్రకటించుకున్నారు. తమ మిత్రపక్షమైన ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు.
కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా విచ్చలవిడిగా ప్రవర్తించడం లేదు. అభివృద్ధి కోసం వస్తున్నవారికి ఆహ్వానం పలుకుతూనే…ప్రతిపక్షానికి సముచిత గౌరవం ఇస్తోంది. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మాత్రం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజలు ఆయనకు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. అక్కడే ఉండి ప్రజలపై అలిగారు. అంతేకాదు ప్రజలు మళ్లీ తననే గెలిపిస్తారని భ్రమల్లో ఉన్నారు. నిజానికి కేసీఆర్ తన బాధ్యతను నెరవేర్చకుండా ఫామ్ హౌజ్ లో ఉంటే…ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు దాన్ని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీకి రావాలంటూ పదేపదే బహిరంగ సభల్లో కోరుతున్నారు. ప్రతిపక్షంగా సహేతుకమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధమంటూ హుందాతనాన్ని ప్రదర్శించారు. కానీ తన ముందు అందరూ చిన్నవాళ్లే అనే భావనలో ఉన్న కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ప్రజల కోసం పోరాటాలు చేయాల్సింది పోయి…ఇంటికే పరిమితమయ్యారు.
తొలుత అనారోగ్య సమస్యలతో కేసీఆర్ బయటకు రాలేదని ప్రజలు కూడా భావించారు. కానీ ఆ తర్వాత కేసీఆర్ వ్యవహారశైలిని గమనించిన ప్రజలు ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకొని ఛీదరించుకుంటున్నారు. బాధ్యతాయుతంగా సీఎం అసెంబ్లీకి ఆహ్వానిస్తుంటే కనీసం స్పందించకుంటా..మా తీరు ఇంతే అన్నట్లు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. పైగా అసెంబ్లీకి వస్తే కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఎక్కడ వివరణ ఇవ్వాల్సి వస్తుందో అని కేసీఆర్ బయటకు రావడం లేదన్న వాదనలకు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి.