అవినీతి మెడకు గట్టిగా బిగుస్తుండటంతో హస్తినకు పరుగులు పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ – కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ దూకుడుతో ఆయన హుటాహుటిన ఢిల్లీలో వాలిపోయారు. అప్పటికే ఆయన రహస్య మిత్రుల్ని కలిసేందుకు వెళ్లారని సోషల్ మీడియా కోడై కూయడంతో…అక్కడికెళ్లి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఏ మాత్రం పసలేని ఆరోపణలను వినిపించేందుకు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కలిసేందుకు వెళ్లారు. నిజానికి ఆయన చెప్పింది కేవలం సాకు మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ఫార్ములా ఈ – కార్ కేసు నుంచి తప్పించండి మహా ప్రభో అంటూ వేడుకోవడమే కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుకున్న ఆంత్యర్యం అనేది ఆయన సన్నిహితులకు కూడా తెలుసు.
పైగా ఆర్ఎస్ఎస్ కు సన్నిహితుడైన కేంద్రమంత్రిని కలిసి..తన అరెస్టును ఎలాగైనా ఆపేందుకు గవర్నర్ పై ఒత్తిడి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించారని గులాబీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు కేటీఆర్ రాత్రికి రాత్రి హోంమంత్రి అమిత్ షా ను కలిసి కాళ్లబేరానికి వచ్చారని మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. దీనిపై కనీసం గులాబీ పార్టీ నుంచి ఖండన కూడా రాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
ఇదంతా ఒక ఎత్తయితే ఏ మాత్రం పసలేకుండా సాగిన కేటీఆర్ ప్రెస్ మీట్ ఎక్కడ మొదలై…ఎక్కడ ఆగిందో అర్ధం కాలేదు. లోకల్ ఇష్యూను జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని తాపత్రయపడ్డ కేటీఆర్…ఏ మాత్రం వర్కవుట్ అవ్వకపోవడంతో ఉసూరుమన్నారు. చివరికి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసేందుకు ఆ అంశాన్ని తెరపైకి తెచ్చి..అసలు విషయాన్ని ముగించారు. దీంతో కేటీఆర్ ప్రెస్ మీట్ విన్న ప్రజలకు అసలు తత్వం బోధపడింది. ఆయన ఢిల్లీకి వచ్చింది ఫిర్యాదు చేసేందుకు కాదు…సొంత పనుల కోసమని.