వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతా ఊహించినట్లుగానే బీఆర్ఎస్ నేతల ప్రోద్భలంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి ఘటనలో ప్రధాన నిందితుడ్ని గుర్తించారు పోలీసులు. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ కలెక్టర్ పై దాడికి పథక రచన చేసినట్లు గుర్తించారు. అతనే జనాల్ని రెచ్చగొట్టి దాడికి పురిగొల్పాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. దాడి జరగడానికి కొద్ది గంటల ముందు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డితో ప్రధాన నిందితుడు సురేష్ 42 సార్లు ఫోన్ లో మాట్లాడినట్లు రికార్డుల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు సురేష్ తో సంభాషణల సమయంలోనే పట్నం నరేందర్ రెడ్డి తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా 6 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారముంది. ఈ కాల్స్ లో జరిగిన చర్చల వివరాలు ఇంకా బయటపడలేదు. అయితే అన్నిసార్లు ఫోన్ చేయడం వెనుక మర్మమేమిటి? ముందస్తుగా చేసిన ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అయితే ప్రధాన నిందితుడు, బీఆర్ఎస్ నేత సురేష్ పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో అత్యాచార కేసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చెల్లెలి వరుసయ్యే యువతిపై అత్యాచారం చేసినందుకు సురేష్ పై కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సాక్షాధారాలు ఉన్నప్పటికీ సురేష్ పై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ కేసుల నుంచి సురేష్ ను రక్షించేందుకు గతంలో పట్నం నరేందర్ రెడ్డి సాయం చేశారని స్థానికంగా చాలా మందికి తెలిసిన విషయమే. నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సురేష్ తాజాగా కలెక్టర్ పై దాడి ఘటనలో కీలక నిందితుడిగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ప్రజల్ని రెచ్చగొట్టి అధికారులపై దాడి చేయించడమే కాకుండా…సోషల్ మీడియాలో ఈ దాడికి వక్రభాష్యాలు చెబుతూ బీఆర్ఎస్ నేతలు పోస్టులు చేశారు. అంతేకాదు ఉన్నతాధికారులపై దాడిని సమర్ధిస్తున్నట్లు పలువురు బహిరంగంగానే మాట్లాడారు. దీంతో అధికారం పోయిందన్న ఫ్రస్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న యాగీపై ప్రజలు మండిపడుతున్నారు.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.