సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని..ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ సలహాలు, సూచనలు అవసరమని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ బాత్రూం లో జారి పడినట్లు తెలియగానే వైద్యశాఖ ఉన్నతాధికారి ని ఆసుపత్రికి పంపించారు రేవంత్. మొన్న జరిగిన రివ్యూలోనూ కేసీఆర్ హెల్త్ పై రేవంత్ ఆరా తీశారు. తాజాగా యశోదా ఆసుపత్రికి వెళ్లి స్వయంగా కేసీఆర్ ను పరామర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పాలిటిక్స్ హాట్, హాట్ గా మారిన నేపథ్యంలో కేసీఆర్ ను రేవంత్ పరామర్శించడం రాజకీయాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అద్దినట్లు అయింది.
2018 ఎన్నికల తర్వాత కేసీఆర్, రేవంత్ ఎదురుపడలేదు. ఆ తర్వాత కేసీఆర్, రేవంత్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో రాజకీయాలు మారాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో రేవంత్ పరామర్శకు వెళ్లారు.కేసీఆర్ ను ఆరోగ్యం ఎలా ఉందని రేవంత్ అడగ్గా.. కోలుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిసింది. కాసేపు అక్కడే ఉండి నమస్కరించి కేటీఆర్ తో కలిసి బయటకు వచ్చారు రేవంత్.
ఏదీ ఏమైనా ఇలాంటి పరిస్థితులలో కేసీఆర్ ను రేవంత్ గత అంశాలను మనస్సులో పెట్టుకోకుండా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి పరామర్శించడం పట్ల అందరూ అభినందిస్తున్నారు.