బీఆర్ఎస్ హ్యాట్రిక్ అసాధ్యమన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలకు చెందిన గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టారు. రోజువారీ షెడ్యూల్ ముగించుకున్న అనంతరం కాంగ్రెస్ లో బలమైన నేతలకు ఎలా చెక్ పెట్టాలనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేఎల్ఆర్, వివేక్ ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరపడం వెనక కేసీఆర్ హస్తం ఉందన్న విమర్శలు వస్తుండగా… తాజాగా తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి కార్యాలయంలో ఐటీ సోదాల వెనక కూడా కేసీఆరే ఉన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
వికారాబాద్ లో ఉన్న ఆర్బీఎల్ కంపెనీలో ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రోజువారీగా ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు కేసీఆర్ కు అందిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూర్ లో బుయ్యని మనోహర్ రెడ్డి గెలుపు దాదాపు ఖాయమని నివేదించాయి. ఇటీవలి తాండూర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ తర్వాత కూడా జనాల అటెన్షన్ ఏమాత్రం మారలేదని.. బుయ్యనికి ఆదరణ రెట్టింపు అయిందని నివేదికలు ఇచ్చినట్లు టాక్ వినిపించింది. పైలెట్ రోహిత్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ నిఘా వర్గాల నివేదికలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే పైలెట్ ను ప్రజల్లో ఉంచి.. బుయ్యని మనోహర్ రెడ్డిని ప్రచారానికి దూరం చేసేందుకు కేసీఆర్ ఐటీని ఉసిగొల్పారన్నా ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే… ఈ ఐటీ సోదాలు ఈ కెఎల్ఆర్, వివేక్, బుయ్యనితో ఆగవని.. మరికొంత కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా సాగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.