కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించిన నాటి నుంచే బీఆర్ఎస్ నేతల ఏడుపు మొదలైంది. అసలు ఆ పథకాలు అమలు సాధ్యం కాదని గగ్గోలు పెట్టారు. ప్రజలను మోసం చేసేందుకే ఇలాంటి ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని కేటీఆర్, హరీష్ తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకటించారు. కట్ చేస్తే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు కౌంటర్ గా రూపొందించిన బీఆర్ఎస్ హామీలు లీక్ అవుతుండటంతో..ఈ హామీలను ఎలా అమలు చేస్తారు..? అనేది అందరి మదిలో కల్గుతున్న ప్రశ్న.
కాంగ్రెస్ ప్రకటించిన మహా లక్ష్మీ పథకం ద్వారా ప్రతి నెలా మహిళకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. దీంతో వీటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ ను అంచనా వేయకుండా ఇలా హామీలు ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. కానీ , ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పథకాన్ని కాపీ కొడుతూ అదే తరహా పథకం ఒకటి.. మహిళా బంధు తీసుకురానుంది. బీఆర్ఎస్ ప్రకటించే మహిళా బంధు పేరిట ఎంత ఆర్థిక సాయం చేస్తారు..? అనేది తెలియకున్నా కాంగ్రెస్ ఇస్తామని ప్రకటించిన దాని కన్నా ఎక్కువే ఉంటుందని చెప్పనవసరం లేదు. మరి..కాంగ్రెస్ ప్రకటించిన పథకానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు..? అని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ ప్రకటించే మహిళా బంధు పథకానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు..? అనేది బిగ్ క్వశ్చన్.
అదే సమయంలో రైతులకు ఫించన్ అనే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది బీఆర్ఎస్. వీటికి నిధుల సర్దుబాటు ఎలా అన్నది బీఆర్ఎస్ ముందున్న అతి పెద్ద సవాల్. కొన్ని నెలల పాటు ఇచ్చి నిలిపివేస్తే రైతుల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి రైతు ఫించన్ సాధ్యాసాధ్యాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వీటితోపాటు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ఆర్థిక సాయం పెంచుతామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పెట్టనున్నారు. కాంగ్రెస్ రైతు భరోసా కింద ఏడాదికి రైతులందరికీ 15వేల పెట్టుబడి సాయం చేస్తామని ప్రకటిస్తే…ఇప్పుడు బీఆర్ఎస్ రైతు ఫించన్ తోపాటు వివిధ పథకాలకు ఆర్థిక సాయం పెంపు హామీలు ఇస్తున్నారు. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే…కాంగ్రెస్ కు అమలు సాధ్యం కాదన్న హామీలు బీఆర్ఎస్ కు ఎలా సాధ్యం అవుతాయో వారికీ తెలియాలి.