బీఆర్ఎస్ ను ఆ పార్టీ సీనియర్ నేతలు వరుసగా నేతలు వీడుతునే ఉన్నారు. ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశంలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగా… తాజాగా మాజీమంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా బీఆర్ఎస్ ను వీడబోతున్నారు.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్న మోత్కుపల్లి ఇటీవల కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడు ప్రగతి భవన్ కు వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకుంటాడని విమర్శించారు. దీంతో ఆయన బీఆర్ఎస్ ను వీడటం ఖాయమని తెలిసింది. ఈ క్రమంలోనే మోత్కుపల్లి బెంగళూరు కేంద్రంగా రాజకీయ మంతనాలు కొనసాగిస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో శుక్రవారం భేటీ అయ్యారు. చాలా సేపు ఈ భేటీ జరగడంతో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
అక్టోబర్ మొదటి వారంలో మోత్కుపల్లి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఆయన తుంగతుర్తి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. టికెట్ విషయమై డీకే శివకుమార్ తో మోత్కుపల్లి చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల తనను కాంగ్రెస్ లో చేరాలంటూ ఆహ్వానించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మోత్కుపల్లి.. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రాకతో కాంగ్రెస్ బలోపేతం అయిందని ఇటీవల రేవంత్ పై ప్రశంసలు కుర్పించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ డీకే శివకుమార్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో మోత్కుపల్లికి ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ ఆ బైపోల్ ముగిసాక మోత్కుపల్లిని దూరం పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తో చర్చించేందుకు అపాయింట్ మెంట్ అడిగితే ఎలాంటి స్పందన లేకపోవడంతో కొంత కాలంగా ఆయన సైలెంట్ గానే ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన సమయంలోనే కేసీఆర్ పై విమర్శలు కురిపించారు. కేసీఆర్ ఓ నమ్మకద్రోహి అంటూ చెలరేగిపోయారు.
Also Read : అది మీ ఇష్టం -సీనియర్లకు ఆప్షన్ ఇచ్చేసిన కాంగ్రెస్ హైకమాండ్..!!