కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్ గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. రాహుల్ కు దమ్ముంటే హైదరాబాద్ లో ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసరడంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అసద్ కు ఈసారి ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పాలని డిసైడ్ అయింది. ఇందుకోసం ప్రణాళికలు ఇప్పటి నుంచి రెడీ చేసుకుంటుంది.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కీలక నేతలపై కాంగ్రెస్ కన్నేసింది. బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎంలోని అసంతృప్త నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కొంతమంది నేతలను చేర్చుకున్న హస్తం పార్టీ.. తాజాగా ఓల్డ్ సిటీలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త మస్కతి డెయిరీ చైర్మన్ అలీ బిన్ ఇబ్రహీంను సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా పాతబస్తీలో పలుకుబడి ఉన్న మహ్మద్ అయూబ్ ఖాన్ అలియాస్ అయూబ్ తన కుమారుడు షాబాజ్ ఖాన్, అర్భాజ్ ఖాన్ తో కలిసి కాంగ్రెస్ లో చేరారు.
టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ ముజఫర్ ఆలీఖాన్ సైతం కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరితోపాటు మరికొంతమంది నేతలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే దిశగా ఓల్డ్ సిటీ కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో ఎంఐఎం కుమ్మక్కు అయిందని…స్వార్ధ ప్రయోజనాల కోసం ముస్లింల ప్రయోజనాలను ఎంఐఎం తాకట్టు పెడుతోందని చెప్తూ కొంతమంది ఎంఐఎం కార్పోరేటర్లను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ మైనార్టీ సెల్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : రేవంత్ రెడ్డిపై భయంకరమైన కుట్ర..?