త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్న అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. పార్టీ బలం, బలహీనతలతోపాటు విజయావకాశాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టిసారిచింది. ఆ దిశగా లోతుగా కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలా 60 వేల మందిని నిత్యం జనాల్లో ఉండేలా ఎన్నికల దళాన్ని ఏర్పాటు చేస్తోంది.
ప్రతి పోలింగ్ బూత్ లో 60మంది ఓటర్లకు ఓ ఇంచార్జ్ ను చొప్పున నియమించి అతని సపోర్టివ్ గా మరో పదిమందిని ఎంపిక చేయనున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ బూత్ ఇంచార్జ్ ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సమాంతరంగా బూత్ లెవల్ ఏజెంట్ ( బీఎల్ఎ ) గా మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించనున్నారు. పది పోలింగ్ బూత్ లను కలిపి ఓ క్లస్టర్ గా విభజించి.. పార్టీ పథకాలపై సమగ్రమైన అవగాహనా కల్గిన ఓ కీలక వ్యక్తిని ఇంచార్జ్ గా నియమించనున్నారు. రాష్ట్రంలోని 119నియోజకవర్గాల్లో మొత్తంగా 60వేల మంది బీఎల్ఎలను నియమించారు.
ఈ ఆరవై వేల మంది బీఎల్ఎలు ఏం చేయాలి..? అనే అంశాన్ని వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిత్యం జనాల్లో చర్చ జరిగేలా వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రజా ఆకాంక్షలకు విరుద్దంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును సామాన్య జనాలకు అర్థమయ్యే రీతిలో వివరించేలా వారిని వారికి సలహాలు, సూచనలు చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయనుంది..? గత కాంగ్రెస్ హయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ, అభివృద్ధిని వివరించడంతో… కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజల దృష్టికి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.
ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాదని బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారానికి దీటుగా..కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేసిన విషయాన్ని ఉటంకిస్తూ..గ్రామాల్లో పార్టీకి ఓ వ్యూహకర్తగా బీఎల్ఎలను నియమించారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ విజయావకాశాల కోసం వ్యూహకర్త పని చేస్తుండగా.. గ్రామ స్థాయిలో బీఎల్ఎలు పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలుగా సేవలు అందించేలా కాంగ్రెస్ ప్రత్యేక నెట్ వర్క్ ను తయారు చేసింది.
Also Read : అది మీ ఇష్టం -సీనియర్లకు ఆప్షన్ ఇచ్చేసిన కాంగ్రెస్ హైకమాండ్..!!