బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాక ఈటల రాజెందర్ తో కలిసి బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ ఆయనతో పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య ఈటల ఏర్పాటు చేసే ప్రతి మీడియా సమావేశంలో ఈటలతో పాటు కనిపించిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒంటరిగానే కనిపిస్తున్నారు. ఎన్నికల ముంగిట నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటున్నామని అందుకే ఈటలతో ఎక్కువగా కనిపించడం లేదని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలతో విభేదిస్తోన్న విజయశాంతి శిబిరంలో చేరిపోయారు. తుల ఉమా తన రాజకీయాన్ని ఒంటరిగా సాగిస్తుంది తప్పితే పార్టీలో ఈటల సపోర్ట్ పై ఎక్కువగా ఆధారపడటం లేదు.
ఈటలను నమ్మి ఆయనతోపాటు బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి ఎందుకు విజయశాంతి శిబిరంలో చేరారన్నది చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం టి. బీజేపీలో ఈటల – విజయశాంతిల మధ్య అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తోంది. కేసీఆర్ ను డీకొట్టే విషయంలో బీజేపీ వైఖరి సరిగా లేదని పార్టీ నేతలతో మంతనాలు కొనసాగిస్తున్న విజయశాంతి గ్రూప్ లో ఈటల సన్నిహితుడు కనిపిస్తుండటంతో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కేసీఆర్ పై యుద్ద ప్రకటనలు చేసిన ఈటల వైఖరిలో కొంతకాలంగా మార్పు గమనించడంతోనే ఏనుగు రవీందర్ రెడ్డి ఆయనతో కలిసి సాగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఈటలతొ దూరంగా ఉంటూ కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంగా పావులు కదుపుతున్న విజయశాంతి గ్రూప్ లో ఏనుగు రవీందర్ చేరిపోయి ఉంటారన్న అభిప్రాయాలూ వెలువడుతున్నాయి.
మరో నేత తుల ఉమా.. ఈమె కూడా పార్టీలో ఏకాకిగా మారిపోయింది. ఈటల సపోర్ట్ తో ఆమె వేములవాడ టికెట్ పై ధీమాగా కనిపించింది. కానీ అక్కడి నుంచి చెన్నమనేని వికాస్ బీజేపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. వేములవాడ టికెట్ తనకు దక్కేలా తన తరుఫున ఈటల ఫైట్ చేస్తాడని తుల ఉమ ఆశించినా ఆమె ఆశలు ఆడియాశలు అయ్యాయని..అందుకే ఆమె కూడా ఈటలతో రాజకీయ అనుబంధానికి దూరం అవుతుందన్న అనుమానాలను బీజేపీ కార్యకర్తలే వ్యక్తపరుస్తున్నారు. ఓ రకంగా.. ఈటలను నమ్మి ఈ ఇద్దరు నేతలు బలైపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : బీజేపీపై రాములమ్మ సంచలన పోస్ట్ – కాంగ్రెస్ లో చేరికకు సంకేతాలేనా..?