గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ లో చేరిక సమయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కారణం..సోమన్న కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తే కావడం. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసి కిషోర్ ను ఓడించాలని ఏపూరి ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే ఆ పార్టీ కాంగ్రెస్ విలీనం దిశగా సాగడంతో సోమన్న రాజకీయ భవితవ్యం సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో సోమన్న బీఆర్ఎస్ లో చేరారు. సోమన్న చేరిక సమయంలో గాదరి కిషోర్ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
సోమన్న బీఆర్ఎస్ లో చేరిక గాదరి కిషోర్ కు ఇష్టం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది అటుంచితే.. సోమన్న చేరికపై స్థానిక ఎమ్మెల్యే కిషోర్ తో బాల్క సుమన్ కనీసం చర్చించలేదని..ఆయనతో సంప్రదించకుండానే సోమన్న చేరికను ఖరారు చేయడంతోనే కిషోర్ అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి గాదరి కిషోర్ కుమార్ కు సోమన్న చేరికతో వచ్చిన ఇబ్బందులు ఏం లేకున్నా… భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళనతో కిషోర్ ఉన్నట్లు వినికిడి. గాదరి కిషోర్ యువ ఎమ్మెల్యే. చాలా భవిష్యత్ ఉంది. అయినప్పటికీ తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న సోమన్నను పార్టీలో తన ప్రమేయం లేకుండా చేర్చుకోవడం అంటే తనకు చెక్ పెట్టె వ్యూహం అయి ఉండొచ్చుననే ఆలోచనతో గాదరి కిషోర్ ఉన్నారట.
బాల్క సుమన్ , గాదరి కిషోర్ విద్యార్ధి ఉద్యమకారుల కోటాలో ఎమ్మెల్యేలు అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇద్దరిలో ఒకరికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పార్టీలో తమ ప్రాధాన్యతను పెంచుకునేలా బాల్క సుమన్ పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. తుంగతుర్తికి చెందిన సోమన్నను పార్టీలోకి తీసుకురావడంలో సుమన్ కీ రోల్ పోషించడమంటే పరోక్షంగా గాదరి కిషోర్ ను బలహీనపరిచే ఎత్తుగడ అయి ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read : బీఆర్ఎస్ లో ఏపూరి సోమన్నకు ఆదిలోనే అవమానం..?