బహుజన యుద్దనౌక ఏపూరి సోమన్నకు బీఆర్ఎస్ లో ఆదిలోనే అవమానం ఎదురైంది. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు శనివారం రోజున ప్రకటించారు సోమన్న. కాని తెలంగాణ భవన్ లో ఆయనకు ఎమ్మెల్సి మధుసూదన చారి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం సోమన్న స్థాయిని అవమానించడమేనని అంటున్నారు. సోమన్నకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని అనుకుంటే..పార్టీలో అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని మధుసూదన చారితో బీఆర్ఎస్ కండువా కప్పించడం పట్ల సోమన్న అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సమక్షంలో సోమన్న బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కేసీఆర్ కాకుండా పార్టీ పట్టించుకోకుండా పక్కనపెట్టేసిన మధుసూదన చారితో కండువా కప్పించడం సోమన్న స్థాయిని దిగజార్చడమేనని అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి సర్పంచ్ లు, వార్డు మెంబర్లు , నల్గొండ నుంచి సర్పంచ్ లు బీఆర్ఎస్ లో చేరేందుకు వస్తే వారికీ కూడా పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కేసీఆర్.. తెలంగాణ బహుజన యుద్దనౌకగా విశేష ఆదరణ కల్గిన సోమన్న చేరిక విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేశారు అని చర్చించుకుంటున్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లకు ఇచ్చే ప్రాధాన్యత కూడా సోమన్నకు ఇవ్వరా..? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరో చర్చ జరుగుతోంది. ఇప్పటికే సోమన్నపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమన్న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరితే.. కేసీఆర్ కు వ్యతిరేకంగా సోమన్న గతంలో పాడిన పాటలను ఎడిట్ చేసి వైరల్ చేస్తారని.. ఇది ఎన్నికల సమయంలో ఏమాత్రం మంచిది కాదనే అంచనాతో కేసీఆర్ సమక్షంలో ఎపూరి చేరికను రద్దు చేసినట్లు విశ్లేషిస్తున్నారు. ఏదీ, ఏమైనా ఎపూరి సోమన్నకు ఆదిలోనే అవమానం ఎదురైందని ఆయన అభిమానులు ఆక్రోశిస్తున్నారు.
Also Read : బీఆర్ఎస్ లోకి ఎపూరి సోమన్న..!?