ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్ట్ చేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీ తరువాత ఆమెను ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. నిజానికి కవితకు ఇటీవల ఈడీ నోటిసులు వచ్చిన తరువాత విచారణ పేరుతో ఆమెను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె తనను వర్చువల్ గా విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై 26న విచారణ జరగనుంది. ఆ విచారణ అనంతరం కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందని అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా అరెస్ట్ అయ్యారు. ఒక్క కవిత మినహా. సౌత్ లాబీ నుంచి లావాదేవీలు నిర్వహించిన వారంతా అప్రూవర్లు అయ్యారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, దినేశ్ అరోరా తో పాటు కవిత బినామీగా ఈడీ చెబుతున్న అరుణ్ రామచంద్ పిళ్లై కూడా అప్రూవర్లుగా మారారు. వీరు చెప్పిన సమాధానాలు, ఈడీ సేకరించిన ఆధారాల ఆధారంగా కవితను ఈడీ అరెస్ట్ చేయవచ్చునని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కవిత అరెస్ట్ ఖరారు అయిందని రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనపరచడం కోసం కవిత అరెస్ట్ ను ఉపయోగించుకోవాలని బీజేపీ , బీఆర్ఎస్ లు చూస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కూతురి అరెస్ట్ కు కేసీఆర్ కూడా అంగీకరించారని సంచలన ఆరోపణలు చేశారు. రెండు నెలలపాటు కవితను తీహార్ జైల్లో పెడుతారని.. తద్వారా ఈ అంశాన్ని సెంటిమెంట్ గా మలుచుకొని అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్ చెబుతున్నారు.
కవిత అరెస్ట్ పక్కా అని రేవంత్ ఇటీవల పదేపదే చెప్తున్నారు. ఆయనకు పక్కా సమాచారం ఉండటంతోనే ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read : తొందర్లోనే కవిత అరెస్ట్ – ఆ తరువాత పెద్దాయనే టార్గెట్..?