ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా కేసీఆర్ ఓట్ల వర్షం కుర్పించే హామీలపై దృష్టిసారించారు. ఒకే ఒక్క పథకం ఓటర్ల మూడ్ మార్చేసేలా హామీ ఉండాలని ఆ జనాకర్షక హామీపై ఫోకస్ పెంచారు. సరైన సమయంలో ఆ హామీని ప్రకటించి ఓట్లు దండుకునేలా కేసీఆర్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఆసరా ఫించన్ తరహాలోనే కేసీఆర్ రైతు ఫించన్ స్కీమ్ ను తీసుకురానున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో ఓ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ దేశమే ఆశ్చర్యపడే పథకం మా వద్ద ఉంది.. దానిని ప్రవేశపెడితే ప్రతిపక్షాలకు నూకలు చెల్లినట్లేనని అన్నారు. కేసీఆర్ మదిలోని ఆ అస్త్రం రైతు ఫించనేనని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కీలక హామీని అక్టోబర్ 16న వరంగల్ లో జరిగే బహిరంగ సభలో ప్రకటిస్తారని చెబుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. బీఆర్ఎస్ అధికారానికి ఎసరు పెట్టేలా ఆ హామీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క హామీతో బీఆర్ఎస్ కు ఓట్లు టర్న్ అయ్యేలా హామీని ప్రకటించాలని సమాలోచనలు మొదలు పెట్టిన కేసీఆర్… రైతులకు ఫించన్ స్కీమ్ ను ప్రకటించేందుకు నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
రైతు ఫించన్ సాధ్యమా..?
రైతులకు ఫించన్ ఇవ్వడం అనేది అంత ఆషామాషీ కాదు. లక్షలాది మంది రైతులకు ఫించన్ ఇవ్వాలి ఉంటుంది. అయితే..రైతులకు ఫించన్ ఇవ్వాల్సి వస్తే ఎంత ఇస్తారు..? రైతులందరికీ ఫించన్ ఇస్తారా..? వయస్సు పరిమితిని విధిస్తారా..? అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆసరా ఫించన్ తీసుకుంటున్న రైతులకు కూడా రైతు ఫించన్ వర్తిస్తుందా..? అనే అంశంపై చర్చ జరగగా.. ఆసరా ఫించన్ అందుకుంటున్న వారికీ ప్రత్యేకంగా రైతు ఫించన్ ఇచ్చే అవకాశం లేదని సమాచారం.
కేసీఆర్ ను నమ్మొచ్చా..?
కేసీఆర్ ఎన్నికల సమయంలోనే ఎన్నో హామీలను ఇస్తారు. తీరా అమలు చేసే విషయంలో సాగ….దీస్తారు. పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అమలు చేశామని ప్రచారం చేసుకుంటారు. 2018ఎన్నికల్లో లక్ష రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్ళు గడిచాక ఆ హామీని అమలు చేశారు. అది కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, ఇళ్లు కట్టుకునే వారికీ ఐదు లక్షల సాయం.. ఇలా ఎన్నో హమీలు ఇచ్చారు. కాని అమలు విషయానికి వచ్చేసరికి చేత్తులేత్తేశారు.
ఇప్పుడు రైతు ఫించన్ విషయంలోనూ అదే జరుగుతుందన్న అనుమానం రైతుల్లో కల్గితే కేసీఆర్ కు చావుదెబ్బ తప్పదు. ఎందుకంటే గత ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ వ్యతిరేకతను తుడిచేసేందుకు రైతు ఫించన్ ను తీసుకురావాలని చూస్తున్నారు కాని కేసీఆర్ ను రైతులు విశ్వసిస్తారో లేదో..!!
Also Read : తొందర్లోనే కవిత అరెస్ట్ – ఆ తరువాత పెద్దాయనే టార్గెట్..?