బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముందే ఆశావహులతో చర్చలు జరిపి ఏ సమస్య ఉండదని నిర్దారించుకున్న తరువాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు కేసీఆర్. తీరా అభ్యర్థుల ప్రకటన వెలువడిన తరువాత ఆశావహులు ఒక్కొక్కరు అసంతృప్తి రాగాలను ఆలపిస్తున్నారు. బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ స్పీకర్ మధుసూదన చారి కుమారుడు ప్రశాంత్ ప్రకటించారు. కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన నాటి నుంచి ఎలాంటి ప్రకటన చేయని ప్రశాంత్ తాజాగా బరిలో ఉంటానని ప్రకటించడం పట్ల రకరకాల సందేహాలు కల్గుతున్నాయి.
టికెట్ ప్రకటన తరువాత గండ్ర దంపతులు మధుసూదన చారి నివాసానికి వెళ్లి.. ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు. అందుకు ఆయన అంగీకరించారు కూడా. ఇప్పుడు ఆయన కుమారుడు రెబల్ గా పోటీ చేస్తానని ప్రకటించడం పట్ల పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నిర్ణయం వెనక మధుసూదన చారి ప్రోత్సాహం ఉందా..? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ప్రశాంత్ వ్యవహారం కేటీఆర్ దృష్టికి కూడా వెళ్లిందని..ఆయన సీరియస్ అయ్యారని సమాచారం. గండ్రకు టికెట్ కేటాయించాక కూడా పోటీలో ఉంటానని ప్రశాంత్ వ్యాఖ్యల వెనక తండ్రి ప్రోద్బలం ఏమైనా ఉందా..? అనే కోణంలో ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నిర్ణయాన్ని సిరికొండ అనుచరులు సైతం తప్పుబడుతున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామని అంగీకరించి ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకోవడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా.. గతంలో మధుసూదన చారి ఓటమికి ప్రశాంత్ వైఖరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే..?