పాలకుర్తి టికెట్ విషయంలో పార్టీ నుంచి స్పష్టత కొరవడటంతో టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..? టికెట్ ఆశిస్తోన్న మహిళా నేత ఝాన్సీరెడ్డికి అనుకూలంగా టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తూ..సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నా స్పందించకపోవడంతో తిరుపతిరెడ్డి మనస్తాపం చెందారా..? వీటన్నింటిని గ్రహించి పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తామని బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి హామీతో తిరుపతి రెడ్డి కమలం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారా..? అంటే పాలకుర్తి పొలిటికల్ సర్కిల్లో అవుననే ప్రచారం జరుగుతోంది.
పాలకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు ఎన్నారైలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. టికెట్ తనదంటే తనదని ఎవరికీ వారుగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎర్రబెల్లి ఓటమే ధ్యేయంగా పావులు కదుపుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఎర్రబెల్లికి సరైన ప్రత్యర్ధి అని ఫిక్స్ అయ్యారు. టికెట్ పై ఆమెకు హామీ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇటీవలి విజయభేరి సభలో పబ్లిసిటీ, బ్రాండింగ్ కమిటీ కన్వీనర్ గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. టీపీసీసీలోకి కూడా తీసుకోవడం ఆమెకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యతకు సంకేతంగా చెప్పొచ్చు.
ఝాన్సీరెడ్డికి పార్టీలో ప్రాధాన్యత పెరుగుతుండటం..తన విషయంలో ఝాన్సీరెడ్డి వర్గీయులు అనుచితంగా ప్రవర్తిస్తున్నా టీపీసీసీ మందలించకపోవడం పట్ల తిరుపతిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఝాన్సీరెడ్డి వర్గీయులు సోమవారం తొర్రూరు మండలం అమ్మాపురంలో నిర్వహించిన ఆరు గ్యారెంటీల అవహాహన సమావేశంలో… పార్టీ పరిశీలకుడు, తమిళనాడు సీఎల్పీ నేత సెల్వ పెరంతాంగై ముందే తిరుపతి రెడ్డిని అవమానించారు. ఆ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్ళగా ఝాన్సీరెడ్డి వర్గీయులు తిరుపతిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా ఝాన్సీరెడ్డి కాని, పార్టీ పరిశీలకుడుగా వచ్చిన నేత కాని వారిని సముదాయించకపోవడం పట్ల ఆయన మనస్తాపం చెందారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తనకు పార్టీలో అవమానాలు ఎదురు అవుతున్నాయని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే తిరుపతి రెడ్డి అసంతృప్తిని గుర్తించిన కిషన్ రెడ్డి ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని కిషన్ రెడ్డి హామీతో రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం వెలువరిస్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీ మార్పు పక్కా అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
Also Read : మహిళా రిజర్వేషన్ ఎఫెక్ట్ – కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ సీట్లు గల్లంతే..!!