బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు మరింత పీక్స్ దశకు చేరుకుంటున్నాయి. కనీస రాజకీయ స్పృహ లేకుండా గొప్పలు చెప్పుకుంటున్నారు. గతంలో రైతు వ్యతిరేకత చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నప్పుడు.. అదంతా తమ కృషేనని సిగ్గు లేకుండా చెప్పుకున్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయడం కూడా తమ పోరాటంతోనే సాధ్యమైందని ప్రచారం షురూ చేశారు. కవిత పోరాటంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లులో కదలిక వచ్చిందని చెప్పుకుంటూ కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
కవిత పోరాటంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపితే… తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులను, విభజన హామీలను పట్టుబట్టి ఎందుకు సాధించలేకపోయారు.? అనే ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. ఇన్నాళ్ళు ఆ దిశగా ఉద్యమం ఎందుకు చేయడం లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎంపీగా ఉన్నప్పుడు ఏనాడూ గొంతెత్తని కవిత..తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు రాగానే మహిళా రిజర్వేషన్ అంశాన్ని ముంగిట వేసుకున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. విచారణ సంస్థలు తన పట్ల సైలెంట్ కావడంతో కవిత కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కట్ చేస్తే..తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపడంతో అదంతా కవిత కృషేనని బీఆర్ఎస్ లీడర్లు ఆమెకు పాలాభిషేకాలు చేయడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
ఓ అంశంలో తమ పార్టిసిపేషన్ అమోఘంగా ఉన్నప్పుడు విజయం దక్కితే అది తమ క్రెడిట్ అని రాజకీయ పార్టీలు చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కాని, మంచి ఏదీ జరిగినా తమ వల్లేనని చెప్పుకోవడమే లీడర్లను పలుచన చేస్తాయి. కవిత తనపై ఆరోపణలు రాగానే మహిళా రిజర్వేషన్ రాగాన్ని అందుకున్నారు. కొన్ని రోజులు ఎదో చేస్తున్నట్లు హడావిడి చేశారు. ఆ తరువాత మౌనం వహించారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడంతో అదంతా కవిత చొరవ వల్లేనని చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు క్రెడిట్ పొందేందుకు ఆరాటపడుతుంటాయి. అంతేకాని ప్రతి దానిని తమ వల్లే అని చెప్పుకుంటే జనాల్లో నైతికత కోల్పోవడం మాత్రం ఖాయం. ఇప్పుడు అదే దారిలో బీఆర్ఎస్ కనిపిస్తోంది.
Also Read : మహిళా రిజర్వేషన్ ఎఫెక్ట్ – కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ సీట్లు గల్లంతే..!!