తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వివేక్ ఇంట్లో జరిగిన ఈ సీక్రెట్ భేటీలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, రవీందర్ నాయక్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తోపాటు సీనియర్ నేత గరికపాటి రామ్మోహన్ రావు, చాడ సురేష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమను ఏమాత్రం పట్టించుకోకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ , ఈటలతో మాత్రమే సమావేశం కావడం పట్ల ప్రధానంగా చర్చించారు. పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోతుందని..బీజేపీలో చేరిన లక్ష్యం దెబ్బతింటుందని.. రోజురోజుకు బీజేపీ బీఆర్ఎస్ కు దగ్గర అవుతున్నట్లు కనిపిస్తోందని చర్చించినట్లు సమాచారం.
గతంలోలాగా బీఆర్ఎస్ పై బీజేపీ దూకుడు తగ్గించిందని…తెలంగాణ ఎన్నికలను అధిష్టానం సీరియస్ గా తీసుకోడం లేదని ఆ పార్టీ నేతలు చర్చించుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు సమాచారం లేకపోవడం… ఎన్నికల వేళ స్తబ్దుగా ఉండటంపై నేతలు ప్రధానంగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం బీజేపీ గ్రాఫ్ పతనం అవుతుందని..కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ కు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు ఇలా ప్రైవేట్ గా కలిసి మాట్లాడుకోవడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎదో కీలక నిర్ణయం తీసుకునే యోచనతోనే ఈ సీక్రెట్ భేటీ జరిగి ఉండొచ్చునని అంటున్నారు.
వివేక్ ఇంట్లో సమావేశమైన నేతలు…కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారంతో కమలంలో కల్లోలం ప్రారంభమైంది. ఇప్పటికే తనకు సోనియా గాంధీ అంటే ఎనలేని గౌరవం అని ఆమె ట్వీట్ చేయడంతో రాములమ్మ కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అయినప్పటికీ రాములమ్మ ఈ ప్రచారాన్ని ఖండించకపోవడంతో అంత నిజమేనని అనుకుంటున్నారు. వివేక్ ఇప్పటికే హైకమాండ్ తో టచ్ లో కి వెళ్లారని చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఒకేసారి ఈ నేతలంతా కమలాన్ని వీడి కాంగ్రెస్ లో చేరితే బీజేపీ , బీఆర్ఎస్ లకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పొచ్చు.
Also Read : బీజేపీలో మళ్ళీ వర్గపోరు – కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల..?