కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్గిందని సంబరపడేలోపు మరో మహమ్మారి కేరళను వణికిస్తోంది. కొత్త వైరస్ వెలుగుచూడటంతో కేరళలో కొత్త భయాలు ముసురుకుంటున్నాయి. నిఫా వైరస్ వెలుగుచూడటంతో కేరళలో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా…కేసుల సంఖ్య పెరుగుతుందనే హెచ్చరికల నేపథ్యంలో పినరయ్ సర్కార్ అలర్ట్ అయింది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ ధాటికి ఇద్దరు ప్రాణాలు వదిలారు. వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని రాష్ట్ర ఆరోగ్య శాఖ వీనాజార్జ్ వెల్లడించారు. కేరళలో కనిపించిన వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని కేరళ సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వైరస్ కేసులు ఐదుకు చేరాయి. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ వ్యాప్తిపై అధికారులు సమీక్ష నిర్వహించారు.
కేసుల సంఖ్య పెరుగుతుందన్న హెచ్చరికలతో కోజికోడ్ జిల్లాలోని అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించారు అధికారులు. రెండు రోజులపాటు సెలవులను ప్రకటించిన అధికారులు..పరిస్థితి అదుపులోకి రాకపోతే మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కరోనా నాటి పరిస్థితులు పునరావృత్తం అవుతాయని హెచ్చరించారు.
Also Read : ఎన్నికలు ఇప్పట్లో లేవు – తెలంగాణలో రాష్ట్రపతి పాలన..?