కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి… బుధవారం గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశానికి హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వద్ద కాళేశ్వరం అవినీతిపై కాగ్ రిపోర్ట్ ను వివరించారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆధారాలను కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్ళారు. మొత్తం ప్రాజెక్టులో రూ.48 వేల కోట్ల అవినీతి జరగగా.. కేవలం పంపు మోటార్ల కొనుగోలు ప్రక్రియలోనే రూ.5600 కోట్లకు పైగా దగా చోటు చేసుకుందన్నారు.
కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి కల్పతరువుగా మారిందని వివరించారు నాగం జనార్ధన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో జరిగిన అవినీతిపై కాగ్ నివేదికను కేసీ వేణుగోపాల్ కు నాగం సమర్పించారు. పార్టీ పరంగా కాళేశ్వరంపై గాలి ఆరోపణలు చేయకుండా పక్కా ఆధారాలతో ముందుకు వెళ్లి కేసీఆర్ , కాళేశ్వరం బండారం బయటపెట్టేలా పార్టీ నేతలను ఆదేశించాలని చెప్పారు. నాగం ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకున్న కేసీ వేణుగోపాల్ ఈ అంశంపై ఫోకస్ పెడుతామని హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ.. కేసీఆర్ కుటుంబం అవినీతికి ఎలా తెగబడిందో ప్రజలకు వివరించాలని నాగంకు కేసీ వేణుగోపాల్ సూచించారు. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకొని కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేయాలన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల ఎజెండాలో చేర్చుతామన్నారు.
Also Read : కాంగ్రెస్ టికెట్ కోసం ఫుల్ పోటీ – ఖరారైన అభ్యర్థులు వీరేనా..?