తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోంది. అధికారానికి దగ్గరగా పార్టీ దూసుకుపోతోంది. అన్ని అనుకూలిస్తే బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పిడుగులాంటి వార్త ఒకటి కాంగ్రెస్ ను తెలంగాణలో వెనక్కి లాగే అవకాశం ఉంది. వైఎస్సార్ టీపీ కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా షర్మిలకు లాభమో నష్టమో కానీ కాంగ్రెస్ కు మాత్రం నష్టమే. ఆమెను ఏపీకి పంపిస్తే సరేసరి..కానీ తెలంగాణలో ఉంచితే మాత్రం కాంగ్రెస్ కు కష్టకాలమే.
షర్మిలకు ఏపీలో రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు ఇదివరకే చెప్పారు. కానీ ఆమె మాత్రం తాను ఏపీకి వెళ్ళను…తెలంగాణలో రాజకీయాలు చేస్తానని పట్టుదలగా ఉన్నారు. పార్టీని విలీనం చేస్తే ఏపీలో కాంగ్రెస్ అద్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హైకమాండ్ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆమె మాత్రం తెలంగాణలో ఉంటానని చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల ఒత్తిడి ఫలిస్తే మాత్రం కాంగ్రెస్ కు ఇబ్బందికరమే.
2018ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి కాంగ్రెస్ కూటమిని నాడు టీఆర్ఎస్ దెబ్బతీసింది. మహాకూటమి గెలిస్తే మళ్ళీ ఆంధ్రుల పాలన వస్తుందని కేసీఆర్ సెంటిమెంట్ ను రగల్చడంతో కాంగ్రెస్ గెలిచే చోట్ల కూడా ఓడిపోయింది. ఇప్పుడు షర్మిలకు తెలంగాణలో రాజకీయం చేసేందుకు అవకాశం ఇస్తే మరోసారి ఆంధ్రుల చేతిలో కాంగ్రెస్ ఉంది.. మళ్ళీ ఆంధ్రోల్ల పాలన అవసరమా..? అనే భావోద్వేగాన్ని కేసీఆర్ కదిలించే అవకాశం మెండుగా ఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ పరిస్థితుల్లో షర్మిలకు తెలంగాణలో అవకాశమిస్తే కాంగ్రెస్ ఓ ఆయుధాన్ని కేసీఆర్ చేతిలో పెట్టినట్లు అవుతోంది. ఈ తరహ ఆయుధం దొరికితే కేసీఆర్ ఎలా చెలరేగిపోతారో చెప్పానవసరం లేదు. తెలంగాణపై బలమైన ఫోకస్ పెట్టిన అధిష్టానం చూస్తూ. చూస్తూ రాష్ట్రంలో పార్టీని దెబ్బతీసుకుంటుందా..? అనేది చూడాలి.
Also Read : కేసీఆర్ పై ఈటల..కేటీఆర్ పై బండి.. హరీష్ పై బూర నర్సయ్యలు పోటీ… బీజేపీ జాబితా, స్ట్రాటజీ ఇదేనా..?