మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మరణంతో ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీపై సందిగ్ధంలో పడ్డారు. భర్త మరణంతో ఆ విషాదం నుంచి ఆమె ఇంకా బయటపడలేకపొతున్నారు. ఈసారి తామిద్దరం పోటీలో ఉంటామని దయాకర్ రెడ్డి గతంలో స్పష్టం చేశారు. కానీ దయాకర్ రెడ్డి అనారోగ్య సమస్యతో మరణించడంతో సీతా దయాకర్ రెడ్డి పోటీలో ఉంటారా..? లేదా..? అనే విషయంపై మక్తల్, దేవరకద్ర పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.
టీడీపీకి రాజీనామా చేసిన దయాకర్ రెడ్డి దంపతులు స్వతంత్రంగానే కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారా..? పొలిటికల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తారా..? అనేది బిగ్ డిబేట్ గా మారింది. దయాకర్ రెడ్డి మరణం తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు కొన్ని రోజులుగా సీతా దయాకర్ రెడ్డిని వరుసగా కలుస్తూ ఆమెను పోటీ చేయాలని కోరుతున్నారు. నియోజకవర్గాల నుంచి హైదరాబాద్ కు నిత్యం పదుల సంఖ్యలో వస్తున్న కార్యకర్తలు సీతా దయాకర్ పోటీ చేయాలంటూ పోటీ బడుతున్నారు.
అభిమానుల విజ్ఞప్తిపై ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు నియోజకవర్గాల నుంచి ఒత్తిళ్ళు మాత్రం తీవ్రం అవుతున్నాయి. ఆమె ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సిట్యుయేషన్ ఏర్పడింది. దాంతో ఆమె పోటీకి ఆసక్తి చూపిస్తే ఏ పార్టీలో చెరనుంది..? అనే అంశంపై కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్కంట కనిపిస్తోంది. తాజాగా ఆమె తన పొలిటికల్ ఫ్లాట్ ఫామ్ పై స్పష్టత ఇస్తానని స్పష్టం చేశారు. పోటీలో ఉండటం మాత్రం ఖాయమని.. ఏ పార్టీలో చేరుతాననేది త్వరలోనే ప్రకటిస్తానని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు సీతా దయాకర్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునే దిశగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. మక్తల్ బలమైన కాంగ్రెస్ అభ్యర్థి కోసం అన్వేషణ మొదలెట్టిన రేవంత్.. సీతా దయాకర్ రెడ్డికి ఇక్కడి నుంచి టికెట్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది.దాంతో ఆమె కాంగ్రెస్ లో చేరిక లాంచనమేనని తెలుస్తోంది.