తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చుననే ధోరణితో అధికార బీఆర్ఎస్ కనిపిస్తోంది. సెప్టెంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అక్టోబర్ లో పోలింగ్ ఉంటుందని పార్టీ కీలక నేతలకు సమాచారం అందించారు కేటీఆర్. ఆయనకు పక్కా సమాచారం ఉందో లేక పార్టీ నేతలను అలర్ట్ చేసేందుకు ఇలాంటి ప్రకటన చేశారో క్లారిటీ లేదు. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రానుంది.
బీఆర్ఎస్ హడావిడి చూస్తుంటే ఎన్నికల షెడ్యూల్ పై అధికార పార్టీకి స్పష్టమైన సమాచారం ఉందనే అనుమానం కలగక మానదు. హడావిడిగా పథకాలలో కదలిక తీసుకొచ్చిన బీఆర్ఎస్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా పథకాల అమలుకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అవన్నీ పాత పథకాలేనని చెప్పి వాటిని ఎన్నికల సమయంలోనూ అందించి ఓటర్ల మెప్పు పొందేలా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు.
కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను రెడీ చేసిందని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫాలసీని అనుసరిస్తామని చెప్పిన టీపీసీసీ ఈమేరకు అభ్యర్థుల జాబితాను వెల్లడించడమే తరువాయి అనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం ఫార్మలిటీ కోసమే టికెట్ ఆశవాహుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారన్న ప్రచారం గాంధీ భవన్ సర్కిల్లో వినిపిస్తోంది. బీజేపీ కూడా అలర్ట్ గానే ఉంది. ఎన్నికలు ముందే వస్తాయని చెప్పి వారిని అప్రమత్తం చేస్తోంది హైకమాండ్.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పదవి కాలం జనవరి వరకు ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందుగా ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించే అధికారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. పాత అసెంబ్లీల పదవి కాలం జనవరి వరకు ఉంటుంది. ప్రస్తుత అధికార పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటే ఒకే ఓడితే మాత్రం ముందే రాజీనామా చేయాల్సి ఉంటుంది.