ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ ఏ పార్టీని ఎప్పుడు, ఎలా దెబ్బకొట్టాలో స్కెచ్ గీసే ఉంటారు. ఎన్నికల వేళ ప్రత్యర్ధి పార్టీల నుంచి కొంతమంది నేతలను కారేక్కించుకొని ఆత్మస్థైర్యం దేబ్బతీయలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంటుంది. ఈసారి కూడా అలాంటి వ్యూహం అమలు చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి.
ఇన్నాళ్ళు బీజేపీని ప్రధాన శత్రువుగా ట్రీట్ చేసిన కేసీఆర్ తన అసలు ప్రత్యర్ధి ఎవరో తేల్చేసుకున్నారు. అందుకే కాంగ్రెస్ ను దెబ్బతీయాలని.. ఇందుకోసం త్వరలోనే కాంగ్రెస్ లోని ఓ ఇద్దరు సీనియర్ నేతలను కారేక్కించాలని చూస్తున్నారు. చర్చలు కూడా పూర్తయ్యాయని ఆ ఇద్దరు సదరు నేతలు కూడా మంచీ టైం చూసుకొని హస్తం పార్టీని వీడుతారనే ప్రచారం కొన్నాళ్ళుగా గుప్పుమంటుంది.
అయితే ఆ ఇద్దరి నేతల వలన పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదనేది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ఎన్నికల వేళ ఆ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ పై సానుభూతి పెరుగుతుందని, అదే సమయంలో ఆ దరిద్రాన్ని నెత్తిన మోయడం ఎందుకన్న వాదనను వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు ఎప్పుడు వివాదాల్లో నానుతుంటారు. అలాంటి వారు బీఆర్ఎస్ లో సైలెంట్ గా ఎలా ఉంటారు..? అని ఆయా జిల్లాల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు అక్కడి లీడర్స్ ని తీసుకోవడమంటే బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరుకు తెరలేపడమే అవుతుంది తప్ప ఆ నేతలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీని బలహీనపరిచేందుకు అస్త్రం ఉపయోగిస్తే అది తమకు లాభదాయకంగా ఉంటుందా..? లేదా..? అనేది బేరీజు వేసుకొని ప్లాన్ చేయాలనీ అభిప్రాయపడుతున్నారు నేతలు.
ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతల విషయంలో ముందు వెనక ఆలోచించకుండా కేసీఆర్ లేని తలనొప్పినే కోరుకుంటున్నారా.? అనే చర్చ బీఆర్ఎస్ లోనే జరుగుతుండటం గమనార్హం.
Also Read : కాంగ్రెస్ , బీఆర్ఎస్ , బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా వచ్చేసిందోచ్..!?