గ్రూప్ -2 పరీక్షల నిర్వహణలో ముందు వెనక చూసుకోకుండా పరీక్షల తేదీలను టీఎస్ పీస్సీ ప్రకటించడం సర్కార్ కు తలనొప్పిగా మారింది. రెండోసారి కమిషన్ ఏర్పాటు అయిన నాటి నుంచి ఏదో ఓ వివాదం అటు కమిషన్ ను, ఇటు సర్కార్ ను చుట్టుముడుతున్నది. టీఎస్ పీస్సీపై చర్యలు తీసుకుంటే అసమర్ధతను అంగీకరించినట్లు అవుతుందన్న భావన ఒకటైతే… వ్యవస్థను గాడిన పెట్టకపోతే ఇంకెన్ని నిర్వాకాలు జరుగుతాయోనని సర్కార్ ఆందోళన చెందుతోంది. ఇలా వరుస వివాదాల్లో టీఎస్ పీస్సీ నానుతోంది.
గ్రూప్ 2 పరీక్షలపై వివాదం
ఈ నెలలోనే గురుకుల పరీక్షలు, గ్రూప్-2 పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23వరకు గురుకుల పరీక్షలు ఉండగా..29,30తేదీలలో వరుసగా గ్రూప్ 2పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్ పీస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇలా వరుస తేదీలలో పరీక్షలకు షెడ్యూల్ ఇవ్వడంపై గ్రూప్ 2అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. వచ్చే నెలకు వాయిదా వేయాలని కోరారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో కూడా ప్రస్తావన తీసుకొచ్చారు కానీ వాయిదాకు కేసీఆర్ నో చెప్పేశారు. నాలుగేళ్ళుగా కాలయాపన చేసిన సర్కార్ ఇప్పుడు ఎన్నికల సమయాన హడావిడి చేస్తోంది.
గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలని కోరితే టీఎస్ పీస్సీ స్పందించలేదు. రోడ్డెక్కి నిరసన తెలిపితే గ్రూప్ -2 అభ్యర్థులను గొడ్డును బాదినట్లు బాదారు. పరీక్షలను రాసేందుకు సన్నధం అవుతోన్న అభ్యర్థులని కూడా చూడకుండా దొరికిన వాళ్ళను దొరికినట్లు లాఠీలతో బాదారు. మరెంతోమందిని అరెస్ట్ చేశారు. గతంలో హడావిడిగా గ్రూప్ 1పరీక్షలు నిర్వహించి చేతులు కాల్చుకున్న టీఎస్ పీస్సీ…ఇప్పుడు గ్రూప్ 2పరీక్షలను హడావిడిగా ఎందుకు నిర్వహిస్తుందో తెలియడం లేదు. ఎలాంటి ముందు చూపు లేకుండా విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ఇప్పుడు టీఎస్పీసీని వేలెత్తి చూపేలా చేసింది.
అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ…పరీక్షలను వాయిదా వేయడం కుదరదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తానంటే కేసీఆర్ అభ్యర్థుల ఒత్తిడికి తలొగ్గినట్లు అవుతుంది. కేసీఆర్ అలా చేసే ఛాన్స్ లేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉండటంతో హైకోర్టు ఎలాంటి తీర్పుని ఇస్తుందోనని ఉత్కంట నెలకొంది. మొత్తానికి టీఎస్ పీస్సీ నిర్వాకం సర్కార్ పరువును మరోసారి బజారుపాలు చేసింది.