ప్రజా యుద్ద నౌక గద్దర్ మరణంతో ఆయన కుమారుడు సూర్యంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందా..? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న గద్దర్ కన్నుమూయడంతో…ఆయన కుమారుడికి టికెట్ ఇస్తే అన్ని వర్గాల మద్దతు ఉంటుందని హస్తం పార్టీ అనుకుంటోందా..? సూర్యంకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే చట్టసభలకు వెళ్ళాలనుకున్న గద్దర్ ఆశను కుమారుడి గెలుపుతో సాకారం చేసినట్లు అవుతుందనే ఆలోచనతో ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
రెండేళ్లుగా కాంగ్రెస్ తో దగ్గరగా ఉంటూ వస్తున్నారు గద్దర్. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరు అవుతున్నారు. రేవంత్ తో సన్నిహితంగా కొనసాగుతూనే…భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో, ఖమ్మంలో నిర్వహించిన సభలో రాహుల్ తో కనిపించారు గద్దర్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే గద్దర్ ప్రకటించారు కూడా. కానీ దురదృష్టవశాత్తూ గుండె సంబంధిత సమస్యతో మరణించారు. దాంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గద్దర్ కుమారిడికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ సూత్రాప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు హైకమాండ్ కూడా పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలోనే గద్దర్ విషయంలో రాహుల్ గాంధీ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గద్దర్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆయన ఉండుంటే.. పార్టీ నుంచి టికెట్ కూడా ఇచ్చే వారన్న వాదనలు వచ్చాయి. తాజాగా గద్దర్ మరణంతో ఆయన కుమారిడికి టికెట్ ఇస్తే ఆ కుటుంబానికి ప్రాధాన్యత కూడా ఇచ్చినట్లు అవుతుందన్న యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే , గద్దర్ చివరి కోరికను సూర్యంకు టికెట్ ఇవ్వడం ద్వారా సాకారం చేసిన వారం అవుతామన్న భావనతో కాంగ్రెస్ ఉంది. అయితే.. సూర్యంకు టికెట్ ఇస్తే ఏ నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : ఆఖరి కోరిక తీరకుండానే కన్నుమూసిన గద్దర్