మరోసారి అధికారంలోకి వస్తామనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన మేకపోతు గాంభీర్యమేనా..? సిట్టింగ్ లకే టికెట్ ఇవ్వాలని భావించిన గులాబీ బాస్ తాజా సర్వే నివేదికలతో ఆలోచనలో పడిపోయారా..? ఓటమి కత్తి అంచనా 50మంది ఎమ్మెల్యేలు వేలాడుతున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
ఈసారి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్…వరుస సర్వేలు చేయిస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సర్వే నివేదికలను పరిశీలిస్తూ ఎమ్మెల్యేలను కొంతకాలంగా అలర్ట్ చేస్తున్నారు. ఏయే ఎమ్మెల్యే పనితీరు బాగోలేదో గుర్తించి గైడ్ చేస్తూ వ్యతిరేకత లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక కోసం ఫీల్డ్ టీమ్ తో చేయించిన సర్వేలో 49మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేలినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సర్వే నివేదికను చూసి కేసీఆరే ఆశ్చర్యపోయినట్లుగా ప్రగతి భవన్ వర్గాల విశ్వసనీయ సమాచారం.
49మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో.. ఆ స్థానాల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలి..? అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఎన్నికల నాటికీ వ్యతిరేకతను పోగొట్టుకునే అవకాశం ఎంతమంది మేర ఉంది..? అలా కాకుండా ఆ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేత ఎవరునున్నారు..? ప్రతిపక్ష పార్టీలో గెలుపు గుర్రం ఎవరు..? ఆ నేతను పార్టీలోకి ఆహ్వానిస్తే వస్తారా..? అనే అంశాలపై కేసీఆర్ ఆయ జిల్లాలో మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. కొసమెరుపు ఏంటంటే…వ్యతిరేకత ఎదుర్కొంటున్న జాబితాలో మంత్రులు కూడా ఉన్నారు.
మూడు జిల్లాలు మినహా మిగతా ఉమ్మడి ఏడు జిల్లాలో ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే , ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇంకా పేర్లు బయటకు రాలేదు.