బీజేపీ తెలంగాణపై ఆశలు వదిలేసుకున్నట్లే ఉంది. బీఆర్ఎస్ తో మునుపటిలా తలపడకుండా దిక్కులు చూస్తోంది. ఆర్టీసీ బిల్లు విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేలా రాజకీయాన్ని మార్చే అవకాశం కమలనాథులకు వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని నేలపాలు చేసుకున్నారు. ఆర్టీసీ బిల్లు విషయంలో తనకు అభ్యంతరాలు ఉన్నాయని గవర్నర్ ఆ బిల్లును తిప్పి పంపారు. ఆ సమయంలో గవర్నర్ నిర్ణయాన్ని సమర్ధించి పొలిటికల్ అటెన్షన్ ను గ్రాఫ్ చేసుకోవాల్సిన కమలం నేతలు కిర్రుమనలేదు. అందివచ్చిన అవకాశాన్ని అందుకోలేక ఆత్మరక్షణలో పడిపోయారు.
బిల్లుపై గవర్నర్ ఎందుకు అభ్యంతరాలు చెప్పారో తెలిసాక కూడా బీజేపీ నేతలు గ్రౌండ్ లోకి దిగలేదు. బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయలేదు. గవర్నర్ ఆర్టీసీ బిల్లును ఆమోదిస్తారని మాత్రమే చెప్పుకున్నారు తప్పితే గవర్నర్ అభ్యంతరాలను ముందు పెట్టి కార్మికుల మెప్పు పొందే ప్రయత్నం చేయలేదు. దీంతో బీఆర్ఎస్ పై యుద్దంలో బీజేపీ కాడి వదిలేసిందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి ఇలాంటి సిట్యుయేషన్ లో బండి సంజయ్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అప్పటికీ ఆయన బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేశారు కానీ, మిగతా నేతల నుంచి కోరస్ సరిగా రాలేదు.
బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత వెంటనే అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. ఆర్టీసీ బిల్లులో లోపాలను, ఉద్యోగులకు జరిగే నష్టాలను చర్చించలేకపోయారు. అయితే, బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అన్ని రకాల ప్రక్రియలు కంప్లీట్ కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కారణం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదు కేవలం ఉద్యోగులను మాత్రమే విలీనం చేస్తున్నారు. అంటే ఉద్యోగులకు ప్రభుత్వమే జీతాలు ఇచ్చేలా బిల్లు రూపకల్పన అన్నట్లు.
ఇందుకోసం ఉద్యోగుల డిమాండ్లను విని, వాటిని పరిష్కరించి, వారిని ప్రత్యేక విభాగంలోనో లేదా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి సమయం పడుతుంది. అయితే, కేటీఆర్ మాత్రం అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయని గట్టిగా చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఏదైనా ప్రక్రియ పూర్తి అయ్యేది ఎన్నికల తదుపరి అని అర్థం అవుతోంది. అయినా…ఇది ఎన్నికల స్టంట్ అని బీజేపీ చెప్పలేకపోయింది. ఫలితంగా రాజకీయ ఎదుగుదలకు అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా మిస్ చేసుకుంది.
Also Read : మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్..?