పాటను సాయుధంగా మలిచి ప్రభుత్వ విధానాలపై ఎక్కుపెట్టిన విప్లవ గాయకుడు గద్దర్ తన చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని కేసీఆర్ పాలనపై అసంతృప్తి వెళ్ళగక్కిన గద్దర్… ప్రజా ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కానీ ఇంతలోనే గద్దర్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ మరణించడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.
వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కు పోటీ చేయాలనుకున్నారు. త్వరలోనే వరంగల్ లో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాలని భావించారు. అవసరమైతే కేసీఆర్ పై పోటీ చేస్తానని కూడా గద్దర్ ప్రకటించారు. ఇటీవల ఆయన పార్లమెంట్ కు వెళ్లాలని మనస్సు మార్చుకున్నారు. కొన్నాళ్ళుగా కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతున్న గద్దర్.. రాహుల్ ఖమ్మం పర్యటన సందర్భంగా ఆయన్ను ముద్దాడారు కూడా.
గద్దర్ కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తే పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు కానీ ఎన్నికల బరిలో నిలవాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఇక సెలవు అంటూ సెలవు తీసుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో జులై 20 వ తేదీన అపోలో ఆస్పత్రిలో చేరిన గద్దర్.. జులై 31 వ తేదీన ఒక లేఖ రాశారు. త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకొని ప్రజా క్షేత్రంలోకి వస్తానని పేర్కొన్నారు. కానీ ఆయన ఆరోగ్యం విషమించి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.
Also Read : కేసీఆర్ పై గద్దర్ సంచలన వ్యాఖ్యలు